అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని జగన్ భావించారట.

read also: హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్,. ఇప్పుడేంత? (రూ.400 నుంచి 30కోట్లవరకు) 

అయితే ఊహించని రీతిలో హిందూపురం నియోకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్ గెలుపొందారు. అయితే పయ్యావుల కేశవ్ ను వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ అండ్ కో ప్రయత్నించింది. 

అయితే వైసీపీ వ్యూహాన్ని ముందే పసిగట్టిన చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యహరించారు. పయ్యావుల కేశవ్ కు పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టి టీడీపీలో ఉండేలా చేశారు. దాంతో వైసీపీ వైపు పయ్యావుల కేశవ్ అడుగులు అక్కడితో ఆగిపోయాయి. 

ఇకపోతే నందమూరి బాలకృష్ణను వచ్చే ఎన్నికల్లోనైనా ఓడించాలని జగన్ భావిస్తున్నారట. అందులో భాగంగా వైసీపీ అభ్యర్థి ఇక్బాల్ ను రంగంలోకి దింపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాలయ్యను కట్టడి చేయాలని భావించిన జగన్ ఎమ్మెల్యే బాలయ్యకు ప్రత్యామ్నాయ మార్గంపై ఆలోచించారు. 

అందులో భాగంగా బాలయ్యపై పోటీచేసి ఓడిపోయిన ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి రావడంతో ఇక్బాల్ వ్యూహాత్మకంగా నియోజకవర్గంలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. ద్వితీయ శ్రేణి నాయకులను వైసీపీలో చేర్చుకుంటూ టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారట. 

ఇకపోతే నియోజకవర్గం ప్రజలు సైతం బాలయ్యపై ఆగ్రహంతో ఉన్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బాలయ్య ఒకటి రెండుసార్లు మినహా అసలు మెుహం చూపించడమే మానేశారట. నియోజకవర్గంలో ప్రజాసమస్యలను అసలు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. 

అసెంబ్లీ సమావేశాలకే కాకుండా జిల్లా కేంద్రంలో నియోజకవర్గాల అభివృద్ధిపై జరిగిన మూడు సమావేశాలకు ఎమ్మెల్యేలంతా హాజరైనా బాలయ్య మాత్రం డుమ్మాకొట్టడంతో నియోజకవర్గ ప్రజలు గుర్రుగా ఉన్నారట.  

అటు అసెంబ్లీ, ఇటు అధికార సమావేశాలకు హాజరుకాకపోవడంతో అధికారులతో పాటు ప్రజల్లో కూడా తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా బాలయ్య నియోజకవర్గానికి వచ్చింది కూడా చాలా అరుదేనని చెప్పుకుంటున్నారు. 

నియోజకవర్గం పాలన పీఏల చేతుల్లో పెట్టేసి సినిమా షూటింగ్ లలో బిజీబిజీగా గడిపారు బాలయ్య. అప్పట్లో బాలయ్య పీఏలపై అవినీతి ఆరోపణలు సైతం వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే 2014 ఎన్నికల సమయంలో ఏకంగా బాలయ్య దంపతులు స్థానికంగా గృహప్రవేశం చేశారు. 

ఇక బాలయ్య హిందూపురంలోనే ఉంటారేమోనన్న చర్చ కూడా నియోజకవర్గ ప్రజల్లో జరిగింది. ఎన్నికలయ్యేంత వరకు బాలయ్య భార్య వసుంధరతోపాటు కుమార్తెలు కూడా అక్కడే తిష్టవేశారు. దాంతో ఇక బాలయ్య కేరాఫ్ అడ్రస్ హిందూపురమేనని నమ్మి ఓట్లు గుద్దేశారు ప్రజలు.  

రెండోసారి గెలిచిన తర్వాత కూడా బాలకృష్ణలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారట. బాలయ్య చూపు షూటింగ్ లపైనే ఉందని నియోజకవర్గంపై లేదని మండిపడుతున్నారట.   

ఎమ్మెల్యే బాలకృష్ణపై ఉన్న వ్యతిరేతతోపాటు మైనారిటీలలో ఉన్న పట్టును క్యాష్ చేసుకునేందుకు జగన్ వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే మైనారిటీలను దగ్గరకు చేర్చుకునేందుకు ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవితో ఆయన దూసుకుపోతున్నారు. 

అయితే నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్లక్ష్యం చేస్తున్నారన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నియోజకవర్గం కార్యకర్తలకు జగన్ సూచించారట. బాలయ్యపై వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటే రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారట. 

అనంతపురం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ గట్టిగా చెప్తున్నారట. ఇప్పటికే రాయలసీమలో మూడు చోట్ల మాత్రమే వైసీపీ ఓటమిపాలైంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు గెలుపొందగా....అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు గెలుపొందారు. వారిలో బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ అన్న సంగతి తెలిసిందే. 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా నియోజకవర్గ కార్యకర్తలు పనిచేయాలని జగన్ సూచించారట. జనవరిలో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే బాలయ్య రూలర్ సినిమాలో బిజీబిజీగా ఉన్నారు. బాలయ్య అడుగుపెట్టకపోతే సీట్లన్నీ వైసీపీవేనని ఆ పార్టీ భావిస్తోంది.