రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు, కరోనా నివారణా చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడచిన 24 గంటల్లో 82 కొత్త కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకూ 80,334 పరీక్షలు చేయించామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

ప్రతి 10 లక్షల జనాభాకు 1504 చొప్పున పరీక్షలు చేయిస్తున్నామని, దేశంలోనే అధిక సగటుతో పరీక్షలు చేసి ప్రథమ స్థానంలో ఉన్నామన్న అధికారులు చెప్పారు. పాజిటివ్‌ కేసుల సగటు దేశం మొత్తం 4.13 శాతం అయితే, ఏపీలో 1.57శాతం అని, అలాగే డెత్‌రేటు దేశం మొత్తం 3.19 శాతం అయితే ఏపీలో 2.46 శాతం అని వారు ముఖ్యమంత్రికి తెలిపారు.

ఈకేసులన్నీ కూడా కంటైన్‌మెంట్‌ జోన్లనుంచే వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ల్యాబులు సిద్ధమవుతున్నాయని., విజయనగరం,ప.గో.జిల్లాల్లో ల్యాబుల ఏర్పాటుపైనకూడా దృష్టిపెడుతున్నామని అధికారులు పేర్కొన్నారు.

Also Read:కరోనా ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ అంటున్నారు: జగన్‌పై జవహర్ సెటైర్లు

మైల్డ్‌ సింప్టమ్స్‌ ఉన్నవారు హోంఐసోలేషన్‌ కోరుకుంటే అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిందని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. టెలిమెడిసిన్‌లో భాగంగా వైద్యం తీసుకుంటున్న వారికి మందులు కూడా సరఫరా చేసే విధానం సమర్థవంతంగా ఉండాలని సీఎం అన్నారు.

అలాగే వ్యవసాయం, అనుబంధ రంగాలపైనా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ పంటల మార్కెటింగ్, ధరలు అంశాలపై ఆయన ఆరా తీశారు. నిరంతరం పర్యవేక్షించి అవసరమైన చోట మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకుంటోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

Also Read:పబ్లిసిటీ కోసం.. పుష్కరాల్లో 30 మందిని చంపేశారు: బాబుపై మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు

దీనిపై స్పందించిన జగన్ .. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులన్నీ బయట రాష్ట్రాలకు ఎగుమతులపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. అందువల్ల దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా తల్లి రొయ్యలు, రొయ్యపిల్లల కొరతపై సమావేశంలో చర్చించారు. తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ రైతులకు ఇబ్బందులు వచ్చినా, అక్కడ జోక్యం చేసుకుని ఆదుకునే చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులకు సూచించారు.