కరోనా ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ అంటున్నారు: జగన్‌పై జవహర్ సెటైర్లు
ముఖ్యమంత్రి జగన్ ఏకంగా ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ అంటున్నారని.. సహజీవనం చేయాలంటూ అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని జవహర్ సెటైర్లు వేశారు.
ముఖ్యమంత్రి జగన్ ఏకంగా ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ అంటున్నారని.. సహజీవనం చేయాలంటూ అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని జవహర్ సెటైర్లు వేశారు. ఎన్నికల కమిషనర్ కనగరాజ్ చెన్నై నుండి ఎలా వచ్చారు.? అతనికి క్వారంటైన్ పట్టదా.? రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేయడానికి అతని అడ్రస్ కూడా తెలియని పరిస్థితి ఎందుకు వచ్చింది.? రాజ్ భవన్ సిబ్బందికి కరోనా సోకడానికి కారణం ఈ ఎన్నికల కమిషనర్ కాదా.? అంటూ ఆయన విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో నమోదైన కేసులకు గల కారణాలను విశ్లేషించిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని, మీ పాలనపై ప్రజలకు క్లారిటీ వచ్చేసిందని జవహర్ అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ప్రజలు నువ్వే కావాలి అనుకునే పరిస్థితుల్ని 10 నెలల్లోనే తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో బాధ్యతగా మెలగాల్సిన మంత్రులే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన... మంత్రి మోపిదేవి ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదని, యథారాజా తధా ప్రజా అన్న రీతిలో మాట్లాడారే తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో మాట్లాడినట్లు లేదన్నారు.
మండలి రద్దు అయితే మంత్రి పదవి పోతుందనే ఫ్రెస్టేషన్లో ఏదేదో ఏదేదో మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నారని జవహర్ అన్నారు. శ్రీకాళహస్తి మాఢ వీధుల్లో దేవుని విగ్రహాన్ని ఊరేగించినట్లు 60 ట్రాక్టర్లతో ర్యాలీ చేయించిన బియ్యపు మధుసూధన్ రెడ్డి ఎవరు.? 50 కరోనా కేసులు నమోదు కావడానికి కారణం ఎవరు.? గూడూరులో ట్రాక్టర్ ర్యాలీ చేసిందెవరు? కనిగిరి ఎమ్మెల్యే 30 వాహనాల్లో కర్నాటక నుండి ఏపీకి వచ్చి గందరగోళం సృష్టించినది ఎవరు.? అంటూ ఆయన నిలదీశారు.
కేంద్రం చేసిన సహాయాన్ని ప్రజలకు ఎంత పంచారు.? ఎంత దోచేశారో ప్రజలకు చెప్పరా.? అంటూ జవహర్ ప్రశ్నించారు. వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణమైనది ఎవరు.? అంటు ఆయన నిలదీశారు.
తాళం వేశాం.. గొళ్లెం మరచితిమి అన్నట్లు ఎక్సైజ్ అధికారులు వ్యవహరించడంతో అక్కడి మద్యం మొత్తం వైసీపీ నేతలు బ్లాక్ లో అమ్ముకుంటున్నారని జవహర్ విమర్శించారు. సారాయి ఏరులై పారుతోందని స్పీకరే చెబుతున్నా పట్టించుకోరని... ఇసుక రీచుల్లో జరుగుతున్న దోపిడీ దేశమంతా చూస్తోందని ఆయన అన్నారు.
ఏప్రిల్ 12న ప్రధాన మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దేశంలోని అందరు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలంటే.. మన ముఖ్యమంత్రి మాత్రం గ్రీన్ జోన్లు, మండలాల వారీగా సడలింపులు అంటూ 400 కేసుల్ని 1177 కేసులకు పెంచారని ఆయన మండిపడ్డారు.
ప్రజల ప్రాణాలపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో స్పష్టమైందని జవహర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కరోనా నియంత్రణలో విఫలమైందని, ఇంటెలిజెన్స్ పని చేయడం లేదని, ఎమ్మెల్యేలు, మంత్రులు దద్దమ్మల్లా తయారయ్యారని ఆయన విమర్శించారు.