Asianet News TeluguAsianet News Telugu

రూ.1400 కోట్ల భారాన్ని మీకోసం చిరునవ్వుతో భరిస్తా: పొదుపు సంఘాలకు సీఎం జగన్ లేఖ

ఆంధ్ర ప్రదేశ్ లోని స్వయం సహాయక సంఘాలకు భారీ సాయం చేసేందుకు జగన్ సర్కార్ ముందుకువచ్చింది. 

AP CM YS Jagan Writes Open Letter  Dwakra Groups
Author
Amaravathi, First Published Apr 22, 2020, 11:21 AM IST

అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో  పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్దమయ్యారు. ఈ నెల 24వ తేదీన ప్రారంభించనున్న "వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం" ద్వారా పొదుపు  సంఘాల మహిళల్లో భరోసా నింపనున్నట్లు ఏపి ప్రభుత్వం తెలిపింది. 

జగన్ లేఖ యదావిధిగా

స్వయం సహాయక సంఘ అక్కచెల్లెమ్మలకు..

గతంలో స్వయం సహాయక సంఘాలు ఎందుకు దెబ్బతిన్నాయో మనందరికీ తెలుసు. వడ్డీలు, చక్రవడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఏ గ్రేడ్‌ సంఘాలు కూడా బీ, సీ, డీ గ్రేడులకు పడిపోయాయి. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు పడుతున్న కష్టాలను నా 3,648 కిలో మీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను. 13 జిల్లాల మన రాష్ట్రంలో జిల్లాలకు మధ్య వడ్డీల్లో తేడాలు ఉండడం, ఆ వడ్డీ మోయలేని భారం కావడం కూడా నా కళ్లారా చూశాను. 

పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి.. మిగిలిన ఏడు జిల్లాల్లో 11 నుంచి 13 శాతం వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ వడ్డీ భారం పేద అక్క చెల్లెమ్మల మీద పడకూడదన్న ఆరాటంతో.. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఆ వడ్డీ భారం మన ప్రభుత్వమే భరిస్తుందని మాట ఇచ్చాను. అంటే ప్రభుత్వమే ఆ వడ్డీ భారం భరిస్తూ అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకే ఇక రుణాలు అందిస్తుంది.అక్షరాలా దాదాపు రూ.1,400 కోట్ల వడ్డీ భారం పేదింటి అక్కచెల్లెమ్మల మీద పడకుండా, ఆ భారాన్ని చిరునవ్వుతో భరించేందుకు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం’ పేరుతో అమలు చేయబోతోంది. 

అంతే కాకుండా 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి, అక్కచెల్లెమ్మల పేరుతో దాదాపు 27 లక్షల ఇళ్ల పట్టాలు, పెద్ద చదువులు చదువుతున్న దాదాపు 12 లక్షల మంది పిల్లల తల్లులకు వసతి దీవెన అందిస్తున్నాం. నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ చట్టం, పేదింటి ఆడ పిల్లలకు అండగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చే మన బడి నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, దిశ పోలీసు స్టేషన్లు, దిశ బిల్లు.. ఇలా అనేక చట్టాలు, కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారితలో మన ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని సవినయంగా తెలియజేస్తున్నాను.

 ఇట్లు,

 వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌.
 

Follow Us:
Download App:
  • android
  • ios