అమరావతి: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పునాలోచన చేయండంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో వుందని ప్రైవేట్ పరం చేయాలని చూడటం తగదని... ఈ ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకురావడం ఎలాగో వివరిస్తూ ప్రధానికి లేఖ రాశారు ముఖ్యమంత్రి. 

ప్రధానికి సీఎం జగన్ సూచించిన కీలక ప్రత్యామ్నాయాలివే: 
 
1. ఉక్కురంగం కోలుకుంటోంది... రెండేళ్లపాటు ఇదే రీతిలో కొనసాగితే...

అన్నిరంగాలతోపాటు ఉక్కురంగం కూడా తిరిగి కోలుకుంటుందని లేఖలో వెల్లడించారు.  7.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యమున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గడచిన డిసెంబర్‌లో 6.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో పనిచేసిందని వెల్లడించారు. తద్వారా రూ.200 కోట్ల లాభాలను ఆర్జించిందని వెల్లడించారు.  ఇదే రీతిలో ప్లాంటు రెండేళ్లపాటు నడిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని వివరించిన సీఎం

2.విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించండి...  

ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కీలక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనికోసం ప్లాంటుకు సొంతంగా గనులు కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్‌ ఎన్‌ఎండీసికి చెందిన బైలదిల్లా గనులనుంచి మార్కెట్‌ రేటుకు ముడిఖనిజాన్ని కొనుగోలు చేస్తోందన్నారు. మెట్రిక్‌ టన్నుకు రూ.5,260లకు కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. ఇదే స్టీల్‌ప్లాంట్‌కు అత్యంత ప్రతికూలంగా మారిందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి. పోటీ పరిశ్రమలన్నింటికీ సొంతంగా గనులు ఉన్నాయని, 60శాతం ముడిఖనిజం అవసరాలను సొంత గనులద్వారా తీర్చుకుంటున్నాయని, మిగిలిన 40శాతం మాత్రమే ఎన్‌ఎండీసీ నుంచి కొనుగోలు చేస్తున్నాయని లేఖలో తెలిపారు.

సెయిల్‌కు 200ఏళ్లకు సరిపడా ముడి ఖనిజం అవసరాలను తీర్చే గనులున్నాయని వెల్లడించారు. ముడి ఖనిజానికి అదనపు చెల్లింపుల వల్ల విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై రూ.3,472 కోట్ల భారం పడుతోందని పేర్కొన్నారు. ఒడిశాలో ఉన్న ఇనుప ఖనిజం గనులను విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయించడంద్వారా ప్లాంట్‌ను తిరిగి ప్రగతిబాటలోకి తీసుకెళ్లొచ్చన్న సీఎం స్పష్టం చేశారు. 

3. ఆర్థిక పునర్నిర్మాణ ప్రక్రియ ద్వారా ప్లాంట్ తిరిగి గాడిలోకి...

వైజాగ్‌ స్టీల్‌ప్లాంటుకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాల ఒత్తిడి తీవ్రంగా ఉందని... చెల్లించాల్సిన రుణాలను వాటాల రూపంలోకి మార్చితే ఈ ఒత్తిడి తగ్గుతుందన్నారు. వడ్డీల బెడదకూడా ఎక్కువగా ఉందని... సీఎం22వేల కోట్ల రుణాలకు దాదాపు 14శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు. ఈ రుణాలను వాటాల రూపంలోకి మార్చి, స్టాక్‌ ఎక్సేంజి లిస్టింగ్‌ ద్వారా బ్యాంకులకు ఎగ్జిట్‌ఆప్షన్‌ కలిగించవచ్చన్నారు.ప్రజలనుంచి కూడా నిధుల సమీకరణకు అవకాశం ఏర్పడుతుందని ముఖ్యంమంత్రి ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.