ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారత దేశ మొదటి ఉపరాష్ట్రపతి, భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి సీఎం జగన్ నివాళి అర్పించారు.

 అమరావతి: భారత దేశ మొదటి ఉపరాష్ట్రపతి, భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా ఎదిగిన రాధాకృష్ణన్‌ స్పూర్తిదాయక ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజున దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 

''చ‌దువే త‌ర‌గ‌ని ఆస్తి, గురువే రూపశిల్పి... విద్యార్థుల‌ను ఉత్త‌మ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా. మాజీ రాష్ట్ర‌ప‌తి, భార‌త‌ర‌త్న డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ జ‌యంతి సంద‌ర్భంగా ఉపాధ్యాయులంద‌రికీ టీచ‌ర్స్ డే శుభాకాంక్ష‌లు'' అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. 

వీడియో

సీఎం క్యాంప్ ఆఫీసులో భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి కార్యక్రమం జరిగింది. ఇందులో సీఎం జగన్ తో పాటు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రారామకృష్ణారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌ పాల్గొన్నారు.