విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ బీబీ హరిచందన్ కు ఘన స్వాగతం పలికారు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. రేణిగుంట విమానాశ్రయం నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిబీ హరిచందన్ కు విమానాశ్రయంలో స్వాగతం పలికారు సీఎం జగన్. 

ముఖ్యమంత్రి వైయస్ జగన్ తోపాటు మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, మోపిదేవి వెంకటరమణలు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ , కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, సీపీ ద్వారకా తిరుమలరావు, పలువురు ఉన్నతాధికారులు సైతం గవర్నర్ కు స్వాగతం పలికారు. 

గౌరవ వందనం అనంతరం గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. మరికాసేపట్లో దుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు గవర్నర్ హరిచందన్. ఇకపోతే బుధవారం ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.