అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు సందర్శనానికి బయలు దేరారు. అయితే మార్గమధ్యలో జగన్ ఉండి వద్ద ఆగారు. పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ నేత కొయ్యే మోషేన్‌రాజు కుమారుడి వివాహా వేడుకకు వైయస్ జగన్ హాజరయ్యారు. 

వధూవరులను జగన్ ఆశీర్వదించారు. అనంతరం అక్కడ నుంచి పోలవరం బయలుదేరారు. ఉండి నుంచి తాడేపల్లి చేరుకున్న వైయస్ జగన్ అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పోలవరం ప్రాజెక్టకు వద్దకు చేరుకున్నారు. 

పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న వైయస్ జగన్ కు మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ సీఎం ఆళ్ళనానితోపాటు స్థానిక ఎమ్మెల్యే బాలరాజులు స్వాగతం పలికారు. అంతకుముందు ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు సీఎం జగన్. ఇక పోతే ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా పోలవరం ప్రాజెక్టు పనులను నేరుగా పరిశీలిస్తున్నారు సీఎం జగన్. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు వైయస్ జగన్. తొలిసారిగా 2011లో హరితయాత్ర పేరిట తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు యాత్ర చేశారు. అనంతరం 2015లో ప్రాజెక్టుల సాధన పేరిట వైసీపీ ఎమ్మెల్యేలతో బస్సు యాత్ర నిర్వహించారు సీఎం జగన్.