దేశంలోని పలు రాష్ట్రాలో మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వర్చువల్ గా సమావేశమయ్యారు.
అమరావతి: వివిధ రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు (corona virus) పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడికి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై, ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై చర్చించేందుకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ వర్చువల్ మీటింగ్ లో క్యాంప్ కార్యాలయం నుండి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రధానమంత్రితో సమావేశం అనంతరం సీఎం జగన్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి మొదలైన నేపథ్యంలో జాగ్రత్తగా వుండాలని... ప్రజలు కూడా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించేలా చూడాలని సూచించారు. అధికారుల ప్రజలను మరోసారి అప్రమత్తం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
తాజాగా తిరుపతి రుయా హాస్పిటల్ లో అంబులెన్స్ మాఫియా అరాచకంగా వ్యవహరించడంతో కన్నకొడుకు మృతదేహాన్ని తండ్రి బైక్ పై తీసుకెళ్ళిన ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు జరిగితే ప్రజలే ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసేలా ప్రతి హాస్పిటల్ లో ఫోన్ నెంబర్లు ఏర్పాటుచేయాలని... అందరికీ కనిపించేలా బోర్డులు పెట్టాలని సూచించారు. అలాగే ఆరోగ్యమిత్రల కియోస్క్‌ల వద్ద ఈ నంబర్లు స్పష్టంగా డిస్‌ప్లే అయ్యేలా చూడాలన్న సీఎం ఆదేశించారు..
108, 104 అంబులెన్స్ లతో పాటు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ లాంటి వాహనాలమీద ఫిర్యాదు నంబర్లు కనిపించేలా ఉండాలన్నారు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురయినా వెంటనే ఆ నంబర్లకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఒకటి రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని.. అలాంటి పరిస్థితి రాకూడదంటే ఇలాంటివి పునరావృతం కాకుండా సమర్థవంతమైన ప్రోటోకాల్ ఉండాలని సీఎం జగన్ పేర్కన్నారు.
విజయవాడ ఆస్పత్రిలో యువతిపై అత్యాచారం వంటి ఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పోలీసులు మరింత విజిలెంట్‌గా, అప్రమత్తంగా ఉండాలన్నారు. విజయవాడ యువతి మిస్సింగ్, ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారం వ్యవహారంలో అలసత్వం వహించారనే ఆరోపణలపైనే స్థానిక సీఐ, ఎస్సై లపై చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వం అంటే మనల్ని నమ్ముకున్న ప్రజలకు అన్నివేళలా మంచిచేయాలని... దీనికోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం కట్టుదిట్టంగా ఉండాలన్నారు. విజయవాడ, తిరుపతిలో మాదిరి ఘటనలు జరగకుండా మరింత కఠినంగా వ్యవహరించాలని వైద్యశాఖ అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.
విద్యా, వైద్యం–ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రజలకు సుపరిపాలన అందినట్లని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా ఇవేనని... ఇందుకు తగ్గట్లుగా అధికారులు వ్యవహరించాలని సీఎం జగన్ ఆదేశించారు.
సీఎం జగన్ తో సమీక్షా సమావేశంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి(కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
