ఉన్నతస్థాయి ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలి:రైలు ప్రమాదంపై పీఎం, రైల్వే మంత్రిని కోరిన జగన్
రైలు ప్రమాదం జరిగిన సమయంలో బ్రేకింగ్ సిస్టం, అలెర్ట్ సిస్టం ఎందుకు పని చేయలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.
అమరావతి: రైలు ప్రమాదం జరిగిన సమయంలో బ్రేకింగ్ సిస్టం, అలెర్ట్ సిస్టం ఎందుకు పని చేయలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. సిగ్నలింగ్ ఎందుకు విఫలమైందని ఆయన ప్రశ్నించారు.కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా విఫలమైందని ఆయన అడిగారు.
ఈ విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఉన్నతస్థాయి ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి ఆశ్విని వైష్ణవ్ లను ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు. భవిష్యత్తులో ఇలాంటి విధ్వసంకర ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.తన ఆలోచనలు, ప్రార్థనలు తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలతో ఉన్నాయన్నారు.ఈ ప్రమాదంలో గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణ అందించేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వైఎస్ జగన్ చెప్పారు.
విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరమన్నారు.మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు సీఎం జగన్. ఈ ఘటనలో గాయపడిన వారిని విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించినట్టుగా చెప్పారు. బాధితులు కోలుకొనేంత వరకు ప్రభుత్వం తోడుగా నిలుస్తుందన్నారు.క్షతగాత్రులను ఎక్స్ గ్రేషియాను సత్వరమే అందించాలని ఆదేశించిన విషయాన్ని సీఎం జగన్ చెప్పారు.
నిన్న రాత్రి విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ పరామర్శించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు. ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించాలని భావించారు.
also read:కంటకాపల్లి రైలు ప్రమాదం: విజయనగరం ఆసుపత్రిలో క్షతగాత్రులకు జగన్ పరామర్శ( వీడియో)
అయితే సీఎం ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు సీఎం వెళ్తే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని భావించారు. దీంతో ఏరియల్ సర్వేకే సీఎం పరిమితమయ్యారు.