అమరావతి: దేశచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కీలక బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశచరిత్రలోనే ఇలాంటి బిల్లులు ప్రవేశపెట్టిన దాఖలాలు లేవని ఇదే మెుట్టమెుదటిది అంటూ స్పష్టం చేశారు. 

అసెంబ్లీలో ఆరు బిల్లులు ప్రవేశపెట్టడంపై సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ప్రథమం, సుదినం అంటూ కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీ  బీసీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు కల్పించినట్లు జగన్ స్పష్టం చేశారు. 

ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవులతోపాటు కాంట్రాక్ట్ పనులు, సర్వీసుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే 50 శాతం అక్కచెల్లెమ్మలకు రిజర్వేషన్లు ఇస్తున్నట్లు తెలిపారు. శాశ్వత బీసీ కమిషన్ సహా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా అసెంబ్లీలో బిల్లులు పెట్టామని తెలిపారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యధిక ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం ఇదొక రికార్డు అంటూ అభివర్ణించారు. 1,33,494 శాశ్వత ఉద్యోగాలు, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నాం. మీ ఆశీర్వాద బలంవల్లే ఇది సాధ్యమవుతోందంటూ సీఎం జగన్ స్పష్టం చేశారు.