అమరావతి: స్పందన కార్యక్రమం ఎలా అమలు జరుగుతోందనే విషయమై తాను ఆకస్మిక తనిణీలు నిర్వహించి పరిశీలిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. 

స్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్ జగన్  మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా జిల్లాల కలెక్టర్లు,. ఎస్పీలతో ఆయన  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రతి సోమవారం నాడు ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు వీలుగా   స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కలెక్టర్లు, ఎస్పీలతో పాటు అన్ని శాఖ అధికారులను ఆదేశించారు. తమ సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలకు రశీదులు ఇవ్వాలని ఆయన సూచించారు. ఏ తేదీ లోపుగా ఆ సమస్యను పరిష్కరించనున్నామో రశీదుపై ఫిర్యాదుదారుడికి తెలపాలని ఆయన కోరారు. 

ప్రజలకు ఇచ్చిన రశీదులను కంప్యూటరీకరించాలని  సీఎం కోరారు. అంతేకాదు వాటిని డేటా బేస్‌లో కూడ అప్‌లోడ్ చేయాలన్నారు. క్రాస్ చెకింగ్ ద్వారా ప్రతి పనిని పర్యవేక్షించాలని ఆయన సూచించారు.

 కలెక్టర్లతో పాటు ఎస్పీలు కూడ  తమకు వచ్చిన ఫిర్యాదులపై స్పందించాలని ఆయన కోరారు. కలెక్టర్లు, ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలని  ఆయన ఆదేశించారు.  తాను కూడ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని జగన్ చెప్పారు.  రచ్చబండ కార్యక్రమంలో భాగంగా స్పందన కార్యక్రమం ఎలా అమలౌతోందో పరిశీలిస్తానని సీఎం వివరించారు. ప్రతి మంగళవారం నాడు అరగంట పాటు కలెక్టర్లు,ఎస్పీలతో  స్పందన కార్యక్రమంపై వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నట్టు జగన్ చెప్పారు.