ఏపీ అసెంబ్లీ రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం అమ్మఒడి పథకంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో ఉండుంటే బాగుండేదని జగన్ వెల్లడించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పథకం లేదన్నారు.

రాష్ట్రంలో చదువురాని వారు 33 శాతం మంది ఉన్నారని.. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్ర పరిస్ధితి దారుణంగా ఉందన్నారు. తన పాదయాత్ర ముగిసిన ఏడాది తర్వాత అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని జగన్ తెలిపారు.

Also Read:మండలిలో వైఎస్ జగన్ కు షాక్: ఏం చేద్దాం, ప్రత్యామ్నాయాలు ఇవీ

ఈ పథకం ద్వారా 42 లక్షల మంది తల్లులకు మేలు కలుగుతుందని, రూ.6,028 కోట్లు ఇందుకోసం ఒకేసారి విడుదల చేశామన్నారు. పిల్లలకు మనమిచ్చే ఏకైక ఆస్తి చదువేనని, నాణ్యమైన విద్యను అందిస్తే వాళ్లు ఉన్నత స్థాయికి వెళతారని జగన్ ఆకాంక్షించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో కూడా మార్పులు తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

విద్యార్ధులకు పౌష్టికాహారం అందిస్తామని, ఈ రోజు నుంచే మధ్యాహ్నం భోజనంలో కొత్త మెనును ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ తెలిపారు. మధ్యాహ్న భోజనం పథకానికి ‘గోరుముద్ధగా’’ నామకరణం చేశామని, మధ్యాహ్న భోజనం అందించే ఆయాలకు గౌరవ వేతనాన్ని రూ.3 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు.  

గోరుముద్ద కొత్త మెను:
సోమవారం: అన్నం, పప్పు చారు, ఎగ్‌కర్రీ, చిక్కీ
మంగళవారం: పులిహోర, టమోట పప్పు, గుడ్డు, 
బుధవారం: వెజిటబుల్ రైస్, కుర్మా, ఎగ్ 
గురువారం: కిచిడీ, టమోట చట్నీ, ఎగ్
శుక్రవారం: అన్నం, పప్పు, ఎగ్, చిక్కి
శనివారం: అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్

పేరెంట్స్ కమిటీ నుంచి ముగ్గురు భోజనం క్వాలిటీ చెక్ చేస్తారని, ఇందుకోసం నాలుగంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. త్వరలో రైట్ టు ఇంగ్లీష్ మీడియం విధానాన్ని అమలు చేయబోతున్నామని, 1 నుంచి ఆరో తరగతి వరకు ఈ ఏడాది ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తామన్నారు.

Also Read:జగన్ కు పెద్ద గండమే: రంగంలోకి పవన్, కేంద్రంతో రాయబారం

బ్రిడ్జి కోర్సులు అందిస్తామని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో సిలబస్ తయారు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. 45 వేల స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తామని, జూన్ 1న ప్రతి విద్యార్ధికి రూ.1,350తో కిట్ అందిస్తామని, ఇందులో బ్యాగ్, బుక్స్, బూట్లు, మూడు జతల బట్టలు, కుట్టించుకోవడానికి డబ్బులు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.