అంటరానితనం రూపం మార్చుకుంది .. పేదలు సేవకులుగానే వుండాలా : అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో జగన్
విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ సభలో విపక్షాలపై మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్. పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగానే వుండిపోవాలా అని సీఎం ప్రశ్నించారు. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమేనని జగన్ వ్యాఖ్యానించారు.
విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ సభలో విపక్షాలపై మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇకపై విజయవాడ గుర్తొస్తుందన్నారు. సామాజిక చైతన్యవాడలా విజయవాడ కనిపిస్తోందని.. దళిత జాతికి, బహుజనులకు అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. సామాజిక న్యాయ మహాశిల్పం కింద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని, ఈ విగ్రహం పేదలకు రాజ్యాంగం అనుసరించే వారికి నిరంతరం స్పూర్తినిస్తుందని జగన్ అన్నారు.
అందరినీ ఒక్కతాటిపైకి నిలబెట్టామంటే అంబేద్కర్ స్పూర్తితోనే సాధ్యమైందన్నారు. మరణం లేని మహానేత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ అని జగన్ ప్రశంసించారు. అట్టడుగు వర్గాల తలరాతను మార్చిన ఘనుడు అంబేద్కర్ అని సీఎం పేర్కొన్నారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదని అనడం కూడా అంటరానితనమేనని జగన్ అన్నారు. పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని సీఎం ఫైర్ అయ్యారు.
ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి పడిపోయిందో అనిపిస్తుందని జగన్ ఎద్దేవా చేశారు. పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగానే వుండిపోవాలా అని సీఎం ప్రశ్నించారు. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమేనని జగన్ వ్యాఖ్యానించారు. పథకాల అమలులో వివక్ష చూపించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమేనని సీఎం పేర్కొన్నారు. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లు పట్టించుకోకపోవడం అంటరానితనమేనని జగన్ అన్నారు.
పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమేనని సీఎం వ్యాఖ్యానించారు. పేద పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే కుట్రపూరిత వార్తలు రాయడం అంటరానితనమేనని జగన్ పేర్కొన్నారు. అంబేద్కర్ భావజలం పెత్తందారులకు నచ్చదని, దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదని సీఎం దుయ్యబట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఏ కోశానా ప్రేమ లేదని.. పేద అక్కచెల్లెమ్మలకు మేలు చేసేందుకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చామని జగన్మోహన్ రెడ్డి గుర్తుచేశారు. మన ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిస్తే పెత్తందారులకు నచ్చడం లేదన్నారు.
పేదవాడికి వైద్యం అందించడమే లక్ష్యంగా ఆరోగ్యశ్రీ అమలు చేశామని సీఎం తెలిపారు. పెత్తందారులకు దళితులంటే జగన్ చులకన అని, చంద్రబాబుకు దళితులంటే నచ్చదన్నారు. పెత్తందారీ పార్టీలకు, పెత్తందారీ నేతలకు పేదలు అవసరం లేదని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ రాజధాని కోసం పేదల భూములు లాక్కున్నారని జగన్ ఫైర్ అయ్యారు. కేబినెట్‌లోనూ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యతనిచ్చామని సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే పెత్తందారుల లక్ష్యమని.. చంద్రబాబు సామాజిక న్యాయం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఎక్కడా లంచాలకు తావులేకుండా సంక్షేమ పథకాలు అందించామని జగన్ వెల్లడించారు.