విశాఖపట్నం: బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్న ఓ వ్యక్తి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. క్యాన్సర్ రోగికి అత్యవసరంగా ఆపరేషన్ చేయించాలని, ఆపరేషన్ కు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. 

పర్యటనలో భాగంగా విశాఖపట్నం వచ్చి అమరావతికి తిరిగివెళ్తుండగా రోడ్డు పక్కన బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి అంటూ కొందరు యువతీ యువకులు ఫ్లెక్సీలను ప్రదర్శించారు. వారిని గమనించిన వైయస్ జగన్ కాన్వాయ్ ను ఆపించి కిందకి దిగి నేరుగా వారి వద్దకు వెళ్లారు. 

ఫ్లెక్సీ గురించి ఆరా తీశారు. తమ స్నేహితుడు నీరజ్ బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్నాడని ఆపరేషన్ కు రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని ఈనెల 30లోగా అతడికి ఆపరేషన్ చేయించకపోతే తమకు దక్కడని వారు ముఖ్యమంత్రి వద్ద బోరున విలపించారు. 

వారి ఆవేదనకు చలించిపోయిన సీఎం జగన్ ఆపరేషన్ కు వెంటనే ఏర్పాటు చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ భాస్కర్ కు ఆదేశించారు. సీఎం మానవతా దృక్పథంతో స్పందించి తమ స్నేహితుడికి ఆపరేషన్ చేయిస్తానని హామీ ఇవ్వడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.