సారాంశం

చంద్రబాబు సర్కార్ హయంలో అవినీతి జరిగిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు చేశారు. విజయవాడలో వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల సందర్భంగా  నిర్వహించిన సభలో ఆయన విమర్శలు చేశారు.

విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం,ఏపీ ఫైబర్ నెట్ స్కాం, నీరు చెట్టు  పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దోపీడీ చేసిందని ఏపీ సీఎం వైఎస్ జగన్  ఆరోపించారు.

వాహన మిత్ర పథకం ఐదో విడత నిధులను  ఏపీ సీఎం వైఎస్ జగన్  శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో  సీఎం జగన్ ప్రసంగించారు.అమరావతి పేరుతో పెద్ద దగా చేశారని  సీఎం టీడీపీపై విమర్శలు చేశారు.  చంద్రబాబు సర్కార్ హయంలో ఎక్కడా చూసినా అవినీతేనన్నారు. 

ఒకవైపు పేదల ప్రభుత్వం ఉంటే మరోవైపు పేదల్ని మోసగించిన వారున్నారని  పరోక్షంగా చంద్రబాబునుద్దేశించి జగన్ విమర్శలు చేశారు. దోచుకోవడానికి, పంచుకోవడం కోసమే టీడీపీకి అధికారం కావాలన్నారు.మీ ఇంట్లో మంచి జరిగితే మీరే సైనికులుగా తనకు అండగా నిలవాలని సీఎం జగన్ కోరారు. వాళ్లలాగా తనకు దత్తపుత్రుడి తోడు లేదని  పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై  విమర్శలు చేశారు జగన్.

త్వరలో జరిగే ఎన్నికలను  కురుక్షేత్ర యుద్ధంగా సీఎం పేర్కొన్నారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో తనకు అండగా నిలవాలని  సీఎం జగన్ కోరారు. ఓటు వేసే ముందు  తమకు జరిగిన మంచి గురించి ఆలోచించాలని ఆయన  ప్రజలను కోరారు. గత పాలకులకు  మనసు లేదన్నారు.పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం తమదన్నారు.నిరుపేదలనకు  వంచించిన గత ప్రభుత్వానికి, ఎన్నికల మేనిఫెస్టోలో  అంశాలను అమలు చేసిన తమ ప్రభుత్వానికి మధ్య యుద్ధం సాగుతుందన్నారు.నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి అండగా నిలవాలని  ఆయన కోరారు.

మ్యానిఫెస్టో ను చెత్తబుట్టలో వేసేసి అందులో పదిశాతం కూడా‌ అమలు చేయని వారితో యుద్ధం జరగబోతుందన్నారు. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుడతారా అనే అహంకారానికి బిసిల పట్ల అనుచితంగా  మాట్లాడిన వారితో  యుద్ధం సాగుతుందని సీఎం జగన్ చెప్పారు. సిబిఎస్ ఇ, ఐబి సిలబస్ తమ ప్రభుత్వం తీసుకొస్తుంటే పేదలకు ఇంగ్లిష్ మీడియం ఉండకూడదన్న పెత్తందారులతో యుద్ధం నిర్వహిస్తున్నామన్నారు.ఇళ్ల స్ధలాలిచ్చిన ప్రభుత్వం తమదైతే పేదలకు ఇళ్ల స్ధలాలివ్వకూడదని కోర్టులకెళ్లి కేసులేస్తున్న పెత్తందారి భావజాలం మద్య యుద్ధం జరగబోతుందని సీఎం జగన్ చెప్పారు.  

టీడీపీ చెబుతున్న మోసపు ప్రచారాన్ని నమ్మవద్దని  జగన్ ప్రజలను కోరారు. కేజి బంగారం, బెంజి కారు కూడ ఇస్తామని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తారన్నారు.ఈ ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని  కోరారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కూడ  ఇదే బడ్జెట్ ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల కంటే తక్కువ అప్పులే చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అయితే తమ ప్రభుత్వం మాదిరిగా చంద్రబాబు సర్కార్ ఎందుకు  సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు.పేదల ప్రజల కోసం లబ్ది చేసేలా  పథకాలు అమలు చేసి  చనిపోయినా కూడ వారి మనస్సుల్లో  నిలిచేలా చంద్రబాబు సర్కార్  పనిచేయలేదన్నారు.