అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌19 పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్‌ సమీక్షించారు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 31 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని... దీన్ని కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటివరకూ ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని జగన్ సూచించారు.

ఇప్పటివరకూ విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్‌ అయినవారిపైనే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరిపై దృష్టి పెట్టాలని సూచించారు. కోవిడ్‌19 వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్రవ్యాప్తంగా మరో దఫా వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఇంటినీ,  ప్రతి మనిషి ఆరోగ్య పరిస్థితిపై సర్వే చేయాలని ఆదేశించారు. 

ఈ సర్వే సందర్భంగా కరోనా లక్షణాలున్నవారు ఎవరైనా ఉంటే సత్వరమే వారికి వైద్య సహాయం అందించాలన్నారు. ఈ సర్వే సమగ్రంగా జరుగుతుండడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కోవిడ్‌19ను వ్యాపించకుండా అడ్డుకట్ట వేయడంలో ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. 

ప్రజలు బయట తిరిగితే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుందని...అందువల్లే లాక్‌డౌన్‌ను ప్రజలంతా  పాటించాలని సూచించారు. మీరు ఇంట్లో ఉండడం వల్ల వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు చేసే సర్వేకు సహకరించిన వారు అవుతారన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ 19 నివారణకు ప్రజలనుంచి పూర్తి సహకారం ఆశిస్తున్నామని అన్నారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకూ పాజిటవ్‌గా తేలిన కేసులన్నీ కూడా విదేశాలనుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్నవారేనని వెల్లడించారు. ఇది సామాన్య ప్రజలకు వ్యాపించకుండా ఉండాలంటే వైద్య, ఆరోగ్యశాఖ, ప్రభుత్వం ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రెండోసారి సర్వే ద్వారా వచ్చే డేటాను విశ్లేషించుకుని ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందన్నారు. 

కరోనా లక్షణాలు ఉన్నవారు విధిగా హోంఐసోలేషన్‌ పాటించాలన్నారు. సమావేశంలో ఏపీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎంసీ ఛైర్మన్‌ సాంబశివారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ స్పెషల్‌ సెక్రటరీ కన్నబాబు పాల్గొన్నారు.