కాంగ్రెస్‌ది కుట్ర .. అప్పుడు బాబాయ్, ఇప్పుడు సోదరి.. నా కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు : జగన్ సంచలన వ్యాఖ్యలు
తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబాన్ని విభజించి పాలించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, చంద్రబాబు అవినీతిపై ఆధారాలతోనే కేసులు నమోదు చేసినట్లు జగన్ తెలిపారు.
తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జాతీయ పార్టీలకు స్థానం లేదని.. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు. తన కుటుంబాన్ని విభజించి పాలించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, చంద్రబాబు అవినీతిపై ఆధారాలతోనే కేసులు నమోదు చేసినట్లు జగన్ తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తోందని, గతంలోనూ మా బాబాయ్‌ని మంత్రిని చేసి మాకు వ్యతిరేకంగా నిలబెట్టిందని ఆయన మండిపడ్డారు.
దేవుడు వాళ్లకు గుణపాఠం చెబుతాడని, వచ్చే ఎన్నికల్లో అప్పటి పరిస్ధితిని బట్టి మా నిర్ణయం వుంటుందని జగన్ స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గరలో వున్నప్పుడు ఎవరూ కక్షపూరిత రాజకీయాలు చేయరని ఆయన పేర్కొన్నారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్ ఈసారి మా సోదరిని ప్రయోగించిందని ధ్వజమెత్తారు. అభ్యర్ధుల మార్పులపై నా సర్వేలు నాకున్నాయని జగన్ పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఎవరూ అపోజిషన్ నేతను అరెస్ట్ చేయాలని అనుకోరని సీఎం అన్నారు.
వివిధ స్థాయిల్లో చంద్రబాబు అవినీతి నిరూపితమైందని.. కాంగ్రెస్, బీజేపీలకు ఏపీలో బలం లేదని జగన్ తేల్చేశారు. అంశాలవారీగా బీజేపీకి మద్ధతిస్తామని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తున్నామని .. కులాలు, ప్రాంతాల కోణంలోనూ కొన్ని మార్పులు చేశామన్నారు. చివరి నిమిషంలో మార్పులు చేసి అయోమయానికి గురవ్వడం కంటే ఇప్పుడే అభ్యర్ధులను మార్చుకోవడం మంచిదని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకత వున్న నేతలకు టికెట్లు ఇవ్వడం లేదని, ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామని సీఎం వెల్లడించారు.