కేంద్రంలో ఈసారి ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకూడదు : అసెంబ్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకూడదని అన్నారు. మనపై ఆధారపడే కేంద్ర ప్రభుత్వం ఉంటేనే మన ప్రయోజనాలు పట్టించుకుంటారని జగన్ తెలిపారు.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పూర్తి మెజారిటీతో రాకూడదని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడే రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకుంటారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..మనపై ఆధారపడే కేంద్ర ప్రభుత్వం ఉంటే ఏదైనా సాధించుకోవచ్చునని జగన్ అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక హోదా ఎండమావిగా కనిపిస్తోందని .. హైదరాబాద్ లాంటి నగరం లేకోవడంతో ఆదాయం కోల్పోయామని, అందుకే విశాఖపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని జగన్ చెప్పారు. చంద్రబాబు హయాంలో సంక్షేమ పథకాలు , స్కీములు లేవని.. టీడీపీ పాలనలో దోచుకో పంచుకో తినుకో అనేదే వుండేదని సీఎం దుయ్యబట్టారు. ఎలాంటి వివక్ష, లంచాలకు తావు లేకుండా పథకాలను అందిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తున్నామని విపక్షాలు నిందలు వేస్తున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోవిడ్ కారణంగా ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయన్నారు సీఎం వైఎస్ జగన్. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం జరిగిందన్నారు. ఊహించని విధంగా ఖర్చులు పెరిగాయని.. ఈ ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులను అధిగమించి మంచి పాలన అందించామని జగన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్ధితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని, కఠినమైన పరిస్ధితుల మధ్య అధికారంలోకి వచ్చామని సీఎం వెల్లడించారు.
2024లో మన ప్రభుత్వం ఏర్పడ్డాక.. జూన్‌లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడదామని జగన్ అన్నారు. రెండేళ్లలో రూ.66 వేల కోట్ల ఆదాయం నష్టపోయామని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టామని, 2015-19 మధ్య కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలో 35 శాతం నిధులు మాత్రమే ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. 41 శాతం ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే 31.5 శాతం నిధులే ఇస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ విధానాల వల్ల ఆర్ధిక వ్యవస్ధ కుదేలైందని.. టీడీపీ ప్రభుత్వం పొదుపు సంఘాల వడ్డీ మాఫీ చేయలేదని జగన్ అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గుతూ వస్తోందని సీఎం పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రానికి ఓ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు వుండాలని జగన్ తెలిపారు. ప్రతి రాష్ట్రానికి ఓ ఎకనామిక్ పవర్ హౌస్ వుండాలని, అందుకే పదే పదే విశాఖ పేరును ప్రస్తావిస్తానని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రం ప్రతి ఏడాది రూ.13 వేల కోట్ల ఆదాయం నష్టపోతోందని జగన్ పేర్కొన్నారు.
రాష్ట్రం ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికి పెద్ద పెద్ద నగరాలు అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇప్పటి కంటే గత ప్రభుత్వానికే పన్నుల వాటా ఎక్కువగా వచ్చిందని జగన్ పేర్కొన్నారు. మన రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి నగరం లేకపోవడం దారుణమన్నారు. మనది రైతులు, వ్యవసాయంతో కూడిన ఎకానమీ అని.. తెలంగాణతో పోల్చితే ఏపీకి తక్కువ ఆదాయమని జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ తలసరి ఆదాయం తగ్గిపోయిందని .. రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టారని, కనీసం ప్రత్యేక హోదాకు కూడా చట్టం చేయలేదన్నారు.