చంద్రబాబు జూమ్‌కు దగ్గరగా.. భూమికి దూరంగా ఉంటున్నారని సీఎం వైఎస్ జగన్‌ సెటైర్లు వేశారు. వక్రబుద్ధితో ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైఎస్సార్‌ రైతుభరోసా పీఎం కిసాన్‌ పథకం మూడో విడత నిధులు, రైతులకు పెట్టుబడి సాయం, నివర్‌ తుపాను నష్ట పరిహారం చెల్లింపు క్యార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

నివర్ నష్టపరిహారం ఇస్తామని ఇప్పటికే చాలాసార్లు చెప్పామని, అయినా కూడా చంద్రబాబు ప్రతిపక్షనేతగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని జగన్ విమర్శించారు. పుత్రుడిని, దత్తపుత్రుడిని ఒక్క రోజు ముందు చంద్రబాబు రోడ్డు మీదకు పంపారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జూమ్‌కు దగ్గరగా.. భూమికి దూరంగా ఉంటున్నారని సీఎం జగన్‌ సెటైర్లు వేశారు. వక్రబుద్ధితో ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం రూ.87,612 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను నిలువునా ముంచిందని, కేవలం రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదని.. ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐ చెప్పిందని సీఎం తెలిపారు. ధాన్యం, విత్తనం, ఇన్సూరెన్స్, విద్యుత్ బకాయిలు, సున్నా వడ్డీ రుణాలను చంద్రబాబు ఎగ్గొట్టారని విమర్శించారు. 

గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లించామని ఈ సందర్భంగా సీఎం జగన్‌ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 434 కుటుంబాలకు సాయం చేశామని చెప్పారు. దాంతోపాటు గత ప్రభుత్వం పెట్టిన సున్నా వడ్డీ బకాయిలు రూ.904 కోట్లు తీర్చామని సీఎం తెలిపారు.

గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు కూడా చెల్లించామని సీఎం తెలిపారు. కాగా,  వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ పథకం మూడోవిడత నిధులు, అక్టోబరులో వచ్చిన నివర్‌ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కింద ఇస్తామన్న నిధుల్ని ప్రభుత్వం మంగళవారం జమచేసింది. 

వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ మూడోవిడత కింద రూ.1,120 కోట్లు, నివర్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.646 కోట్లను చెల్లించింది.