ఇసుక కొరతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుక నూతన విధానం, కొరత తదితర అంశాలపై జగన్ మంగళవారం అమరావతిలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని కీలక రీచ్‌లను ఓపెన్ చేయాలని ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జేసీ స్థాయి అధికారులకు అప్పగించాలని సీఎం సూచించారు.

ఆ అధికారి కేవలం ఇసుక సరఫరా, రవాణాలను మాత్రమే చూడాలని  జగన్ ఆదేశించారు. ఇసుక రవాణాకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుముకు ఎవరు ముందుకొచ్చినా వారిని తీసుకోవాలని.. అలాగే ఇసుక అక్రమ రవాణా జరక్కుండా చూడాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎట్టి పరిస్ధితుల్లోనూ కనిపించకూడదని ఈ అంశంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.