అమరావతి: ఇసుక పాలసీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. స్పందన కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్ పలు కీలకమైన అంశాలపై అధికారులతో చర్చించారు. 

ప్రభుత్వం కేటాయించిన ధరకు ఇసుక రవాణా చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా వారికి అనుమతులు ఇవ్వాలంటూ ఆదేశించారు. కిలోమీటర్ కు రూ.4.90 చొప్పున ఇసుకను అందజేసే వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు.  

కిలోమీటర్‌కు రూ.4.90 ల చొప్పున ఎవరు ముందుకు వచ్చినా రవాణాకోసం వారి వాహనాలను వినియోగించుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రీచ్‌లనూ ఓపెన్‌ చేయాలని ఆదేశించారు. 

జిల్లాలో ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జేసీ స్థాయి అధికారికి అప్పగించాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఆ అధికారి కేవలం ఇసుక సరఫరా, రవాణాలను మాత్రమే చూసేలా ఉండాలన్నారు. రాష్ట్రంలో వరదలు తగ్గడంతో ఇసుక లభ్యత అందుబాటులోకి వస్తుందన్నారు. 

ఇసుక తక్కువ రేట్లకే అందించాలని జగన్ ఆదేశించారు. రాబోయే 60 రోజుల్లో ఇసుక పాలసీపై ఖచ్చితంగా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుకను వీలైనంత త్వరగా స్టాక్ పాయింట్లలోకి చేర్చాలని జగన్ సూచించారు. 

ప్రతి జిల్లాలోని 2 వేలమంది నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన యువకులు ఆయా కార్పొరేషన్ల ద్వారా, కాపు కార్పొరేషన్‌ కలుపుకుని వాహనాలు కొనుగోలు చేసేలా చూడాలని ఆదేశించారు. నిరుద్యోగ యువతకు ఇసుక రవాణా కాంట్రాక్టు ఇచ్చేలా చూడాలని సీఎం కోరారు. 

ఇసుక రవాణాకు సంబంధించి రవాణా కాంట్రాక్టు నిరుద్యోగులకు ఇచ్చే అంశంపై మార్గదర్శకాలు తయారు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మరోవైపు ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. 

కలెక్టర్లు, ఎస్పీలు ఇసుక అక్రమ రవాణాపై దృష్టిపెట్టాలని సూచించారు. రాజకీయ జోక్యాన్ని ఎక్కడా కూడా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికీ, ఇప్పటి ప్రభుత్వానికీ ఇసుక పాలసీలో ఖచ్చితమైన తేడా కనిపించాలని సూచించారు.  

ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదన్నారు. ప్రోత్సహించే పనికూడా అధికారులు చేయోద్దని హితవు పలికారు. ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు జగన్ తెలిపారు.  

రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరా ఉండకూడదని స్పష్టం చేశారు. చెక్‌పోస్టుల్లో గట్టి నిఘాను పెంచాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో అవసరాలకు తగిన ఇసుక లేదన్న విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ప్రభత్వమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం జగన్ హెచ్చరించారు.