ఉగాది నుంచి అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లకు సత్కారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అంతేకాకుండా వారికి సేవా రత్న, సేవా మిత్ర వంటి బిరుదులు ఇవ్వాలని అధికారులకు సూచించారు.

తాడేపల్లిలోని క్యాంపు‌ కార్యాలయంలో బుధవారం నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను మనం ‘ఓన్‌’ చేసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు.

ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు వెంటనే కార్యరూపం దాల్చాలని అధికారులకు ఆదేశించారు. గ్రామస్తులు ప్రస్తావించే సమస్యలు పరిష్కారం కావాలని .. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించామని, కొందరు జీతాల పెంపు కోసం రోడ్డెక్కడం తనకు బాధ కలిగించిందని తెలిపారు.

వాలంటీర్ల వ్యవస్థలను మెరుగైన సేవలందించడం కోసమే ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. వాలంటీర్‌ అంటేనే స్వచ్ఛందంగా పని చేసే వారని అర్ధమని జగన్ స్పష్టం చేశారు.

విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో వ్యయ నియంత్రణపై మనం తీసుకున్న చర్యలను కేంద్రం ప్రశంసించిందని.. మన విధానాలు మిగిలిన రాష్ట్రాలను ఆకర్షించాయని జగన్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.