ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేదిశగా చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
అమరావతి: కరోనా కారణంగా గత రెండేళ్ళుగా బాగా తగ్గిన రాష్ట్ర ఆదాయాన్ని తిరిగి పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆర్థిక, రెవెన్యూ, వాణిజ్యం, ఎక్సైజ్, అటవీ, పర్యావరణం, గనుల శాఖలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) సమీక్ష నిర్వహించారు. అదనపు ఆదాయాలకోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ఆయా శాఖల అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
ఎస్‌ఓఆర్(రాష్ట్రాల సొంత ఆదాయం)ను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తద్వారా రాష్ట్ర సొంత ఆదాయాలు పెరగడానికి తగిన ఆలోచనలు చేయాలని సూచించారు. వీటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకోవడానికి సంబంధిత శాఖలకు చెందిన అధికారులు క్రమం తప్పకుండా సమావేశం కావాలని ముఖ్యమంత్రి సూచించారు.
ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాన్న సీఎం సూచించారు. పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు ఖచ్చితమైన ఎస్‌ఓపీలను పాటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వ్యాట్ కేసులను పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టుకోవడంపై దృష్టి సారించాలని సీఎం సూచించారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్ సేవలను సమీక్షించి... తగిన మార్పులు, చేర్పులు చేయాలని అధికారులకు సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగుచూసిన అవినీతి ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించకూడదని... ఆమేరకు పటిష్టమైన ఎస్‌ఓపీలను అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల పేద ప్రజలకు భారీగా లబ్ధి చేకూరిందని అధికారులు సీఎంకు తెలిపారు. ఓటీఎస్ పథకం ద్వారా, ఉచిత రిజిస్ట్రేషన్ల రూపేణా పేదలకు ఇప్పటివరకూ రూ.400.55 కోట్ల లబ్ధి చేకూరిందని సీఎంకు వివరించారు. టిడ్కో ఇళ్ల ఉచిత రిజిస్ట్రేషన్ల రూపేణా పేదలకు మరో రూ.1230 కోట్ల మేర లబ్ధి చేకూరిందని అధికారులు తెలిపారు. గతంలో ఎన్నడూకూడా ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో పేదలకు ఇంతటి ప్రయోజనం జరగలేదన్న అధికారులు సీఎం జగన్ కు వివరించారు.
ఈ సమావేశంలో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ సమీర్ శర్మతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
