Asianet News TeluguAsianet News Telugu

వాలంటీర్లకు ఘనంగా సత్కారం, నగదు పురస్కారం... సీఎం జగన్ కీలక నిర్ణయం

రాష్ట్రంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తించేలా ఉగాది సందర్భంగా వారిని సత్కరించేలా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సీఎం సంబంధిత అదికారులను ఆదేశించారు. 

AP CM YS Jagan Review Meeting with housing and village,ward secretariat officers
Author
Amaravathi, First Published Mar 10, 2021, 5:18 PM IST

అమరావతి: గృహనిర్మాణం,  గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌  సమావేశమయ్యారు. గృహనిర్మాణం, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు, గ్రామ, వార్డు వాలంటీర్లకు అవార్డుల ప్రధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.

వాలంటీర్లకు పురస్కారాలు: 

రాష్ట్రంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తించేలా ఉగాది సందర్భంగా వారిని సత్కరించేలా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సీఎం సంబంధిత అదికారులను ఆదేశించారు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేర్లతో వాలంటీర్లకు సత్కారం చేయనున్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఏడాదికిపైగా సేవలు అందించిన 2,18,115 మంది వాలంటీర్లకు ‘‘సేవా మిత్ర’’, 4వేల మంది వాలంటీర్లకు ‘‘సేవా రత్న’’, నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున ‘‘సేవా వజ్రాలు’’గా ఎంపిక చేయాలని నిర్ణయించారు. 875 మంది వాలంటీర్లకు సేవా వజ్రాలు కింద సత్కారం దక్కనుంది. 

ప్రతి మండలానికి 5 గురు,ప్రతి మున్సిపాల్టీకి 5 గురు, ప్రతి కార్పొరేషన్‌ నుంచి 10 మంది చొప్పున ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డుల తదితర కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా ఎంపిక జరగనుంది. ప్రోత్సాహకంగా సేవామిత్రలకు రూ.10వేల నగదు, సేవా రత్నాలకు రూ. 20వేల నగదు,సేవా వజ్రాలకు రూ.30వేల నగదుతో పాటు మెడల్, ప్రశంసాపత్రం, బ్యాడ్జీలను అందించనున్నారు. వీటిని ముఖ్యమంత్రి ‌సీఎం పరిశీలించారు. 

గృహనిర్మాణంపై: 

తామే ఇళ్లు కట్టుకుంటామని ఆప్షన్‌ ఎంచుకున్న వారికి నిర్మాణ సామగ్రి విషయంలో సహాయకారిగా నిలవాలని సీఎం ఆదేశించారు. స్టీలు, సిమ్మెంటు, ఇతరత్రా నిర్మాణ సామగ్రిని తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా నీరు, కరెంటు సౌకర్యాలను కల్పించడంపై వెంటనే దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.ఇళ్లు కట్టుకోవడానికి కరెంటు, నీళ్ళు లాంటి సదుపాయాలు లేవనే పరిస్థితి ఎక్కడా కనిపించకూడదని... కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్లస్థలాల కేసుల పరిష్కారంపై దృష్టిపెట్టాలని సూచించారు. 

ఇళ్లనిర్మాణంలో నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీపడొద్దు అధికారులతో సీఎం అన్నారు. ఖర్చు ఎక్కువైనా పరవాలేదని, ఖచ్చితంగా నిర్మాణంలో నాణ్యత పాటించాలని అధికారులకు స్పష్టంగా చెప్పారు సీఎం.జగనన్న కాలనీల్లో రోడ్ల వెడల్పు 20 అడుగులకు తగ్గకుండా చూడాలని సీఎం ఆదేశించారు. జగనన్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు సౌకర్యం తదితర వసతుల కల్పనపై సమగ్రంగా సమీక్ష చేసిన సీఎం ఈమేరకు తయారు చేసిన డిజైన్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్బ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, గృహనిర్మాణ శాఖ స్పెషల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్, ఎపిఎస్‌హెచ్‌డిసిఎల్‌ ఎండి నారాయణ భరత్‌ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios