రాష్ట్రంలో నీటిపారుదల, ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సమీక్ష చేపట్టారు.

అమరావతి: పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టని.. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డబ్బులు ఇస్తోందని అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా ప్రజలకు అందించాలనే తపనతో ఉన్నామన్నారు. ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నామని జగన్ తెలిపారు. 

రాష్ట్రంలో నీటిపారుదల, ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని సీఎంకు వివరించారు నీటిపారుదల అధికారులు. స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు 91 శాతం పూర్తయ్యాయని... జూన్‌ 15 కల్లా మిగిలిన పనులు పూర్తిచేస్తామని సీఎంకు తెలిపారు. ఈనెలాఖరు కల్లా స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. 

ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలను పూర్తిచేశామని... వీటికి సంబంధించి సంక్లిష్టమైన పనులను పూర్తిచేశామని తెలిపారు. కాఫర్‌ డ్యాంలో 1,2 రీచ్‌లు జూన్‌ నెలాఖరు నాటికి, కాఫర్‌ డ్యాంలో 3,4 రీచ్‌ పనులు జులై నెలాఖరు నాటికి నిర్ణీత ఎత్తుకు పూర్తిచేస్తామన్నారు. దిగువ కాఫర్‌ డ్యాంకు సంబంధించిన పనులు కూడా వేగవంతంగా పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

read more ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స దోపీడీకి చెక్: రూల్స్ బ్రేక్ చేస్తే భారీ ఫైన్, కేసులు

ఈ పోలవరం నిర్మాణానికి సంబంధించి కేంద్రం వద్ద దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని అధికారులకు తెలిపారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రంలో బిల్లులు పెండింగులో ఉండడం సరికాదన్నారు. అధికారులు వెంటనే దీనిపై దృష్టిపెట్టాలని... చేసిన ఖర్చు వెంటనే రీయింబర్స్‌ అయ్యేలా చూడాలన్నారు.

 వచ్చే మూడు నెలలకాలానికి కనీసం రూ.1400 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెప్తున్నారు... కాబట్టి అధికారులు డిల్లీ వెళ్లి వెంటనే పెండింగులో ఉన్న బిల్లులు క్లియర్‌ అయ్యేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.