అవినీతిపై పోరాటాన్ని ముమ్మరం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. దీనిలో భాగంగా మండల స్థాయిలో ఏసీబీ పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేయడంతో పాటు ఏసీబీ యాప్ తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలో ఏసీబీ, దిశ, ఎస్‌ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (ys jagan mohan reddy), అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో హోం శాఖపై ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిశ తరహాలో అవినీతి ఫిర్యాదులకుగానూ ఏసీబీ యాప్ (acb app) తేవాలని అధికారులకు సూచించారు.
ఏసీబీకి యాప్ ద్వారా ఆడియో ఫిర్యాదు సైతం చేయొచ్చని జగన్ అన్నారు. అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను ప్రక్షాళన చేయాల్సిందేని సీఎం అధికారులను ఆదేశించారు. నెలరోజుల్లోగా ఏసీబీ యాప్ రూపకల్పన జరగనుందని, నేర నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగాన్ని బలోపేతం చేయాలని జగన్ సూచించారు. అలాగే మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లు ఉంటాయన్నారు.
ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ ఉంటుందని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. డ్రగ్స్ (drugs case) వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండరాదన్నారు. మూలాల్లోకి వెళ్లి కూకటివేళ్లతో పెకిలించేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇందుకోసం.. విద్యాసంస్థలపైనా ప్రత్యేక నిఘా పెట్టాలని జగన్ సూచించారు. చీకటి ప్రపంచంలో వ్యవహారాలను నిర్మూలించాలని ఆదేశించారు. ప్రతినెలా ఈ అంశాల్లో ప్రగతిని నివేదించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎస్‌ఈబీకి ప్రత్యేక కాల్ సెంటర్ నంబర్ ఉంటుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశానికి హోంశాఖ మంత్రి తానేటి వనిత (taneti vanitha) , సీఎస్ సమీర్ శర్మ (ap cs sameer sharma) , డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (ravindranath reddy ips) , ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
