తమ ప్రభుత్వం తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలతో ఆంధ్ర ప్రదేశ్ మరికొన్ని నెలల్లోనే మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా మారనుందని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
అమరావతి: అనూహ్య డిమాండ్ వున్నా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసి మిగులు విద్యుత్ ను కలిగివుండే స్థాయికి ఆంధ్ర ప్రదేశ్ మరికొద్ది నెలల్లో చేరుకుంటుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. సెకీతో ఒప్పందం కారణంగా సుమారు 45 మిలియన్ యూనిట్లు రాష్ట్రానికి దశలవారీగా అందుబాటులో రానుందన్నారు. మొత్తం మూడు దశల్లో సెకీ విద్యుత్తు అందుబాటులోకి వస్తోందని... 2023 చివరి నాటికి మొదటి దశలో సుమారు 18 మిలియన్ యూనిట్లు, రెండో దశలో సుమారు 18 మిలియన్ యూనిట్లు, మూడో దశలో సుమారు 9 మిలియన్ యూనిట్లు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని సీఎం వెల్లడించారు.
విద్యుత్ శాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ (ys jagan) సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ డిమాండ్, సప్లై, పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలపై సీఎం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు.
విద్యుత్‌రంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సరఫరా సంక్షోభం, విద్యుత్ ఉత్పత్తి రంగంపై పడ్డ ప్రభావం తదితర అంశాలను వివరించారు. అంతర్జాతీయంగా, దేశీయంగా వచ్చిన పరిణామాలతో బొగ్గుకు తీవ్ర కొరత ఏర్పడిందన్నారు. విదేశాల్లో బొగ్గు ధరలు విపరీతంగా పెరగడం వల్లకూడా సరఫరా తగ్గి దేశంలో విద్యుత్తు కొరతకు దారితీసిందని అధికారులు సీఎంకు వివరించారు.
ఇలా ఓవైపు బొగ్గు కొరత వున్న సమయంలోనే విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు. గడచిన మూడేళ్లుగా వర్షాలు బాగా కురిసాయని...దీంతో భూగర్భజలాలు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉండడం వల్ల వ్యవసాయరంగం నుంచి కూడా విద్యుత్ డిమాండ్ స్థిరంగా ఉందన్నారు. మరోవైపు కోవిడ్ పరిస్థితుల తర్వాత పారిశ్రామిక ఉత్పత్తిరంగం పుంజుకుందని తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతలు కూడా అధికస్థాయిలో ఉన్నాయని... ఫలితంగా విద్యుత్ వినియోగం అధికంగా ఉందని అన్నారు. ఏప్రిల్ 8న అత్యధికంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 12,293 మిలియన్ యూనిట్లకు చేరిందని... రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్ ఇదని అధికారులు పేర్కొన్నారు.
వినియోగదారులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో భారీ ఎత్తన విద్యుత్తును కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు సీఎం జగన్ తెలిపారు. మార్చిలో సగటున రోజుకు రూ.36.5 కోట్లు ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేశామని... ఏప్రిల్‌లో సగటున రోజుకు రూ.34.08 కోట్లు వెచ్చించి కరెంటు కొన్నామన్నారు.వినియోగదారులు ఇబ్బంది పడకుండా, కరెంటు కోతలను అధిగమించడానికి మార్చి నెలలో మొత్తంగా 1268.69 మిలియన్ యూనిట్లను రూ.1123.74 కోట్లు వెచ్చించి కొన్నామని, ఏప్రిల్‌లో 1047.78 మిలియన్ యూనిట్లు రూ.1022.42 కోట్లతో కొన్నామని అధికారులు సీఎంకు వివరించారు.
బొగ్గు విషయంలో రానున్న రెండు సంవత్సరాలు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని కేంద్రం నుంచి సంకేతాలు వచ్చాయన్న అధికారులు తెలిపారు. జనరేషన్ ప్లాంట్లకు కావాల్సిన బొగ్గులో కనీసం 10 శాతం వరకూ విదేశాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు నొక్కిచెప్తున్నారని అధికారులు వెల్లడించారు. డిమాండ్‌ను అంచనా వేసుకుని ఆ మేరకు కార్యాచరణ చేసుకోవాలన్న సీఎం అధికారులను ఆదేశించారు. బొగ్గు కొనుగోలు విషయంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలన్న సీఎం సూచించారు.
