వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష.. రైతులకు మద్ధతు ధరపై అధికారులకు కీలక ఆదేశాలు
వ్యవసాయం, అనుబంధ రంగాలు , పౌర సరఫరాల శాఖలపై బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు . అవినీతికి ఆస్కారం లేకుండా మద్ధతు ధర లభించేలా చర్చలు తీసుకోవాలని ఆదేశించారు . మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నివారించాలని సీఎం వెల్లడించారు.

వ్యవసాయం, అనుబంధ రంగాలు , పౌర సరఫరాల శాఖలపై బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంటల సాగు, తాజా పరిస్ధితులను అధికారులు జగన్‌కు వివరించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతమే నమోదౌందని ఆయనకు వివరించారు. శెనగ సహా ఇతర విత్తనాలను అందుబాటులో వుంచుతున్నామని.. రబీలో సాగుచేసే శెనగ విత్తనాలపై సబ్సిడీని 25 నుంచి 40 శాతానికి పెంచినట్లు జగన్‌కు వివరించారు. దాదాపు లక్ష క్వింటాళ్ల శెనగ విత్తనాలు సిద్ధం చేశామని.. ఇప్పటికే 45 వేల క్వింటాళ్ల పంపిణీ చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. అవినీతికి ఆస్కారం లేకుండా మద్ధతు ధర లభించేలా చర్చలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది రెండో విడత రైతు భరోసాకు సిద్ధం కావాలని జగన్ సూచించారు. చేయూత కింద మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగించానలి సీఎం ఆదేశించారు. బ్యాంక్‌ల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా పాడి సహా ఇతర స్వయం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు.
ధాన్యం కొనుగోలులో రైతులకు మేలు జరిగేలా చూడాలని.. మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నివారించాలని సీఎం వెల్లడించారు. పీడీఎస్ ద్వారా మిల్లెట్లను ప్రజలకు పంపిణీ చేయాలని.. మిల్లెట్ల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై కరపత్రాలతో అవగాహన కల్పించాలని జగన్ సూచించారు.