కాపీ కొట్టి పులిహోర వండారు: టీడీపీ మేనిఫెస్టోపై జగన్ ఫైర్
టీడీపీ మేనిఫెస్టో పై ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. కాపీ కొట్టి ఎన్నికమ మేనిఫెస్టో ను ప్రకటించారని బాబుపై జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కర్నూల్: కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ హామీలను కలిపి చంద్రబాబు కొత్త మేనిఫెస్టో తయారు చేసుకున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.
వైసీపీ హామీలను కూడా కాపీ కొట్టి పులిహోర వండారని ఆయన సెటైర్లు వేశారు.
వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద రైతులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రైతు పెట్టుబడికి నిధులను గురువారంనాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా కర్నూల్ జిల్లా పత్తికొండలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాజమండ్రిలో మహానాడు పేరుతో చంద్రబాబు డ్రామా చేశారన్నారు. మహానాడులో ఎన్నికల మేనిఫెస్టో పై జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదన్నారు. జనంలో బాబు తిరిగే అలవాటు లేదన్నారు. అందుకే కర్ణాటకలో చంద్రబాబు మేనిఫెస్టో పుట్టిందని ఆయన ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చంపి, మళ్లీ ఎన్టీఆర్ ను చంద్రబాబు కీర్తిస్తున్నాడని సీఎం జగన్ గుర్తు చేశారు. చంద్రబాబుకు ఒరిజినాలిటీ , పర్సనాలిటీ, క్యారెక్టర్, క్రెడిబులిటీ లేదన్నారు సీఎం.
పురాణ గాథల్లోని కొన్ని ఘటనలను చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడాన్ని గుర్తుకు తెస్తున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. అందమైన మాయలేడి రూపంలో సీతమ్మ దగ్గరకు వచ్చిన మారీచుడిని గుర్తుకు తెస్తున్నాయన్నారు. సీతమ్మ దగ్గరకు యాచకుడి రూపంలో వచ్చిన రావణుడిని గుర్తుకు తెస్తున్నాయని చెప్పారు.
సత్యాన్ని పలకడు, ధర్మానికి కట్టుబడని చంద్రబాబునాయుడు తీరును ఏపీ సీఎం జగన్ ఎండగట్టారు. .విలువలు, విశ్వసనీయత అంటే చంద్రబాబుకు తెలియదన్నారు. పొత్తుల కోసం ఏ గడ్డి అయినా తినేందుకు సిద్దమైన పార్టీ టీడీపీ అని సీఎం విమర్శించారు. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు కలగలిపిన పార్టీ టీడీపీ అని సీఎం విమర్శించారు. పొత్తులు, ఎత్తులు, జిత్తులే చంద్రబాబుకు కావాలన్నారు. పోటీ చేసేందుకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులు కూడా టీడీపీకి లేరని ఆయన ఎద్దేవా చేశారు.
మరో ఛాన్స్ ఇవ్వండి ఏదో చేసేస్తా అని చంద్రబాబు చెబుతున్నారన్నారు. ఇప్పటివరకు సీఎంగా ఉండి ఏం చేశారని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. సీఎంగా ఇంతకాలంపాటు పాలించిన చెప్పుకోవడానికి ఏదైనా పథకం ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు జగన్.
1995లో తొలి సారిగా చంద్రబాబు సీఎం అయ్యారన్నారు. కానీ ఇప్పుడు కూడ మరోసారి ఒక్కఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారన్నారు. జనంలో లేని బాబు పార్టీకి పొత్తులు కావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
సీఎంగా మొదటి సంతకానికి ఒక క్రెడిబులిటీ ఉంటుందన్నారు. కానీ చంద్రబాబునాయుడు సీఎంగా తొలి సంతకాన్ని మోసం మార్చాడన్నారు. గత టర్మ్ లో రైతులకు , డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన హామీని బాబు విస్మిరించారని జగన్ ప్రస్తావించారు. మంచి చేయడమనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదన్నారు.
ప్రజల కష్టాల నడుమ పేదల గుండె చప్పుడు నుండి తమ పార్టీ మేనిఫెస్టో పుట్టిందని సీఎం జగన్ తెలిపారు. మన మట్టి నుండి తమ పార్టీ మేనిఫెస్టో పుట్టిందన్నారు. చంద్రబాబు, గజదొంగల ముఠాది అధికారం కోసం ఆరాటమని ఆయన విమర్శించారు.దోచుకోవడం, దాచుకోవడమే చంద్రబాబు గ్యాంగ్ పని అని సీఎం పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఒక యుద్ధం జరగబోతోందన్నారు. పేదలకు , పెత్తందార్లకు మధ్య యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు డీటీపీ కావాలా? మన డీబీటీ కావాలో తేల్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు. తమ ప్రభుత్వంతో మంచి జరిగిందని భావిస్తే తనకు అండగా నిలవాలని సీఎం జగన్ కోరారు.
.