వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సిబిఐ విచారణ, అరెస్టులపై జాగ్రత్తగా మాట్లాడాలని వైసిపి నేతలకు సీఎం జగన్ సూచించారు.
అమరావతి : మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వివేకా హత్యతో వైఎస్ కుటుంబానికే చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సంబంధాలు వున్నట్లు విచారణ సంస్థ సిబిఐ అనుమానిస్తోంది. ఇప్పటికే వైఎస్ భారతి మేనమామ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిబిఐ కడప ఎంపీ అవినాష్ ను కూడా అదుపులోకి తీసుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇలా అరెస్టులు, కోర్టులో విచారణలు జరుగుతున్న వేళ ఈ వ్యవహారంపై మాట్లాడేటపుడు జాగ్రత్తగా వుండాలని మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు వైసిపి నాయకులకు సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది.
వైఎస్ వివేకా హత్యకేసు, కొనసాగుతున్న అరెస్టులపై పూర్తి సమాచారం తెలిసివుంటేనే మాట్లాడాలని... లేదంటే మాట్లాడవద్దని వైసిపి నాయకులకు సీఎం జగన్ ఆదేశించినట్లు సమాచారం.కుటుంబసభ్యుల అరెస్ట్, సిబిఐ విచారణ... ఇలా వివేకా హత్యకేసులో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ముఖ్య నేతలతో జగన్ చర్చిస్తున్నారు. అలాగే న్యాయ నిపుణులతో కూడా ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇక ఇప్పటికే వివేకా హత్య కేసులో అరెస్టులు సీఎం జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాయి. వివేకా హత్యతో సీఎం సతీమణి వైఎస్ భారతికి కూడా సంబంధాలున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి కడప ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక హత్యకు గురయ్యింది కూడా వైసిపి నాయకుడే. దీంతో ఈ వ్యవహారంపై రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది.
Read More వారిద్దరి నుంచి ప్రమాదం పొంచి ఉంది.. అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేస్తే సీబీఐకి ఏం లాభం: దస్తగిరి
వైఎస్ వివేకా హత్య, ప్రస్తుత అరెస్టులపై నాయకులు ఎవరికి తోచింది వారు మాట్లాడితే పార్టీకి నష్టం జరగవచ్చని జగన్ భావిస్తున్నట్లున్నారు. అందువల్లే పూర్తి సమాచారంతో కేవలం కొందరు కీలక నాయకులతో మాత్రమే ఈ వ్యవహారంపై మాట్లాడించాలని సీఎం అనుకుంటున్నట్లున్నారు. అందుకే పూర్తి సమాచారం లేకుండా ఎవ్వరూ మాట్లాడొద్దని వైసిపి నాయకులను సీఎం ఆదేశించినట్లు సమాచారం.
ఇదిలావుంటే తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టుతో తనను కూడా సిబిఐ అరెస్ట్ చేస్తుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలుచేయగా నిన్న(సోమవారం) విచారణ జరిగింది. ఇవాళ మళ్ళీ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. మరోవైపు ఇవాళ విచారణకు హాజరుకావాల్సిందిగా అవినాష్ కు సిబిఐ నోటీసులిచ్చింది.
ఓవైపు కోర్టు విచారణ, మరోవైపు సిబిఐ విచారణ వుండటంతో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ జరిగే పరిణామాలను బట్టి డిల్లీకి వెళ్ళాలో లేదో సీఎం జగన్ నిర్ణయించుకుంటారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామంటూ హైకోర్టుకు సిబిఐ తెలిపింది. దీంతో ఇవాళ విచారణకు హాజరయ్యే అవినాష్ అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది.