10 రోజుల్లో పీఆర్సీని ప్రకటన: తిరుపతిలో ఉద్యోగులకు జగన్ హామీ
10 రోజుల్లోనే పీఆర్సీని ప్రకటిస్తామని ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. పీఆర్సీ విషయమై ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ కు తిరుపతిలో వినతి పత్రం సమర్పించారు. ఈ విషయమై జగన్ 10 రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
తిరుపతి: పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఇవాళ ఉదయం తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు.ఈ సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ ను కలిసి పీఆర్సీ గురించి వినతి పత్రం సమర్పించారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తైందని సీఎం జగన్ తెలిపారు.
Prcపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశుతోష్ మిశ్రా ఏడాది క్రితమే నివేదికను ఇచ్చింది. పీఆర్సీ నివేదిక ఇంకా ఉద్యోగ సంఘాలకు చేరలేదు. ఉద్యోగుల ఫిట్‌మెంట్ పై కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. గత నెల 12న 12న జాయింట్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రభుత్వం పీఆర్సీపై స్పష్టత ఇవ్వలేదు.ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిని 27 శాతంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై ఐఆర్ 27 శాతానికి పరిమితం చేయడంపై ఉద్యోగ సంఘాలు అంగీకరించడానికి సిద్దంగా లేవు. వేతన ఫిట్ మెంట్ పై కూడా కనీసం 60 శాతంగా ఉండాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుండి నెలకొంది.
ఉద్యోగుల సమస్యలపై సంప్రదింపులకు ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి ఆదినారాయణను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఏడాది అక్టోబర్ 29న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. అయితే వారంలో పీఆర్సీ నివేదికను విడుదల చేస్తామని సీఎస్ సమీర్ శర్మ హమీ ఇచ్చారు. అయితే ఇంతవరకు పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందించలేదు. ఇవాళ కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పీఆర్‌సీపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లో ఈ అంశాన్ని సెటిల్ చేయాలని Employees Union నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఉద్యోగులకు, రిటైర్డ్ సిబ్బందికి రావలసిన కోట్లాది రూపాయలు పెండింగ్ నిధుల విడుదలపై కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. 2018 జూలై 1 నుంచి పీఆర్‌సీ సిఫారసులను అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఆ తేదీకి ఒక్క రోజు తక్కువైనా అంగీకరించమన్నారు. 55 పర్సంటేజీ ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ విషయమై ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్దమయ్యాయి. ఇటీవలనే సీఎస్ సమీర్ శర్మకు ఉద్యోగ సంఘాల నేతలు నోటీసు ఇచ్చారు. నెల రోజులుగా పీఆర్సీ విషయాన్ని తేల్చాలని ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినా కూడా స్పష్టత రాని కారణంగానే ఆందోళనకు సిద్దమైనట్టుగా ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ఈ నెల 7 నుంచి తమ ఉద్యమం ప్రారంభం అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. అయితే ఇవాళ తిరుపతిలో సీఎం జగన్ ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలకు ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. 10 రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.