ఏపీలో వైఎస్ జగన్ సర్కారు మరో సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నగర, పట్టణ ప్రాంతాల్లో పేదలకు తక్కువ ధరకే ఫ్లాట్లు విక్రయించాలని సీఎం నిర్ణయించిందిన సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించి భూసేకరణ కోసం ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీకి టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్ నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా డీటీసీపీ డైరెక్టర్ వి.రాముడు, ఏపీ హౌసింగ్ బోర్డు వీసీ బి.రాజగోపాల్, ఏఎంఆర్టీఏ జాయింట్ డైరెక్టర్ టి.చిరంజీవిలు వ్యవహరిస్తారు.

ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువరించారు. భూసేకరణకు గాను నగర, పట్టణ ప్రాంతాలతో పాటు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న భూములను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. జనవరి 21లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

లాభాపేక్ష లేకుండా లాటరీ పద్దతిలో లబ్దిదారులకు ప్లాట్లను కేటాయిస్తామన్నారు. మధ్యతరగతి ప్రజలకు కూడా సొంత స్థలం, వివాదాల్లేని ప్లాట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామని సీఎం జగన్ ఇది వరకే తెలిపారు. ఇందుకోసం ఓ సరికొత్త విధానాన్ని రూపొందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.