దేశంలో కోవిడ్ కేసుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ పలువురు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

తిరుమల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ దంపతులకు స్వాగతం పలికిన అనంతరం నేరుగా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి పాల్గొననారు.

వ్యాక్సిన్‌ తయారీ, వ్యాక్సినేషన్‌ ముందుగా ఎవరికి ఇవ్వాలి? ప్రాధాన్యతలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, పంపిణీ సందర్భంలో అనుసరించాల్సిన పద్ధతులపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు.

ప్రధానితో వర్చువల్ మీటింగ్ తర్వాత జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్‌ పంపిణీలో ఎలాంటి పద్ధతులు అనుసరించాలన్న దానిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

వ్యాక్సిన్‌ పంపిణీలో అనుసరించే శీతలీకరణ పద్ధతులు? అందుకు ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండాలి? తదితర అంశాలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్‌ను నిల్వ చేయడం, అంతే కాకుండా అదే ఉష్ణోగ్రతలో మారుమూల ప్రాంతాలకు దాన్ని తరలించడం అన్నది రెండూ కూడా కీలక అంశాలని, దీనిపై కూడా మార్గదర్శక ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

వ్యాక్సిన్‌ పంపిణీ సన్నద్ధతపైనా సరైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జగన్ సూచించారు. ఆయా అంశాలపై సాంకేతిక సమాచారం సేకరించాలని, వివిధ కంపెనీల నుంచి కూడా సంబంధిత సమాచారం తీసుకుని అధ్యయనం చేయాలన్నారు. వ్యాక్సిన్‌ సంబంధిత అంశాలపై కూడా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.