విజయవాడ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు నాతోపాటు మెుట్టమెుదటగా అడుగులు వేసిన వ్యక్తి ఆర్థిక వేత్త సోమయాజులు అని స్పష్టం చేశారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఆర్థిక వేత్త, దివంగత డీఏ సోమాయాజులు తనకు గురువుగా ఉండేవారని తెలిపారు. 

డీఏ సోమయాజులు 67వ జయంతిని పురస్కరించుకుని సోమవారం విజయవాడలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్‌ సోమయాజులు చిత్రపటానికి నివాళులర్పించారు. 

సోమయాజులు ఒక లివింగ్‌ ఎన్‌సైక్లోపిడియ అంటూ ప్రశంసించారు. సోమయాజులుకు ప్రతి విషయంపై అవగాహన ఉండేందని తెలిపారు. తనకు, వైసీపీ శ్రేణులకు ఆయన తరగతులు నిర్వహించేవారని గుర్తు చేశారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు నా వెనుక తొలిఅడుగు వేసిన వ్యక్తి సోమయాజులు అని చెప్పుకొచ్చారు. ఆయన ఒక గురువుగా నాకు ప్రతీ విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చేవారని చెప్పుకొచ్చారు. 

2014లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు కూడా తన ప్రతి స్పీచ్‌ వెనకాల ఉండి నడిపించిన వ్యక్తి సోమయాజులు అన్న అని గర్వంగా చెబుతున్నాని అన్నారు సీఎం జగన్. ఆయన తనయుడు కృష్ణను చూస్తే సోమయాజులు అన్న మన మధ్యలోనే ఉన్నట్టుగా ఉందన్నారు. 

కృష్ణకు కూడా అన్ని విషయాలపై అవగాహన ఉందని తండ్రిని మించిన తనయుడిగా కృష్ణ ఎదుగుతాడని ఆకాంక్షించారు. సోమయాజులు అన్న కుటుంబానికి తనతోపాటు ఇక్కడున్న వారంతా తోడుగా ఉంటారు. ఆయన కుటుంబానికి దేవుడు మంచి చేస్తాడని నమ్ముతున్నట్టు సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.