Asianet News Telugu

ప్రకాశంలో ఆధిపత్య పోరు: ఆ ఇద్దరిని మార్చాలంటూ సీఎం జగన్ ఆదేశం

మరోవైపు సీఐల బదిలీ వ్యవహారంపై మాజీఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది. దర్శి, ఒంగోలు రూరల్ సీఐల బదిలీల విషయంలో స్థానిక నేతలు తనపై ఒత్తిడి తెస్తున్నారని వారిని మార్చాలంటూ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. 
 

ap cm ys jagan order to mlas for ci transfers
Author
Amaravathi, First Published Jul 4, 2019, 4:48 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: ప్రకాశం జిల్లాలో సీఐల బదిలీ వ్యవహారం సరికొత్త ట్విస్ట్ నెలకొంది. ఒంగోలు రూరల్‌, దర్శి సీఐల విషయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం కాస్త సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లింది. 

దీంతో ఇద్దరు సీఐలను మార్చి కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని కొత్తవారిని నియమించుకోవాలని జగన్ ఆదేశించారు. ఆ బాధ్యతలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అయిన మద్దిశెట్టి వేణుగోపాల్, టీజేఆర్ సుధాకర్ బాబులకు అప్పగించారు. 

సీఐల బదిలీపై సీఎం వైయస్ జగన్ దృష్టి సారించడంతో సీఎంవోలో కదలిక వచ్చింది. సీఐల బదిలీల వ్యవహారంపై ఇద్దరు ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. అయితే సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించిన ఒంగోలు రూరల్‌ సీఐ బదిలీ విషయంలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగేందుకుగాను మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు చర్చలు జరిపారు.  

ఇకపోతే జిల్లాలో ఇటీవలే 16మంది సీఐలు బదిలీ అయ్యారు. అందులో దర్శి, ఒంగోలు రూరల్, చీరాల వన్ టౌన్, చీరాల టూటౌన్, అద్దంకి సీఐల బదిలీల విషయంపై వైసీపీ గుర్రుగా ఉంది. ఈ వ్యవహారం తెలుసుకున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి  శాసనసభ్యులు, నాలుగు నియోజకవర్గాలలో ఇన్‌ఛార్జ్‌ల సిఫార్సులకే ప్రాధాన్యమివ్వాలని సూచించారు.  

దాంతో అద్దంకి, చీరాల సీఐల బదిలీల విషయంలో వెంటనే కొన్ని మార్పులు జరిగాయి. అయితే దర్శి సీఐగా బదిలీ అయిన కరుణాకర్‌ని దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్‌, ఒంగోలు రూరల్‌ సీఐగా సుబ్బారావుని ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు సిఫార్సు చేయటంతో ఆ ఇద్దరినీ కొనసాగించారు.
 
అయితే ఈ రెండు బదిలీల విషయంపై దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దర్శి నియోజకవర్గంతో పాటు తన సొంత మండలం అయిన చీమకుర్తి సంతనూతలపాడులో ఉండటంతో ఆ నియోజకవర్గంలోను పార్టీ అభ్యర్థుల గెలుపునకు ఆయన తనవంతు సహకారాన్ని అందించారు. 

అయితే తనకు ఒక్కమాట కూడా చెప్పకుండా ఎమ్మెల్యేలు సీఐలను నియమించుకోవటం పట్ల బూచేపల్లి అసంతృప్తికి గురయ్యారట. మరోవైపు దర్శి సీఐ కరుణాకర్ విషయంలో స్థానిక పార్టీ నాయకుల మధ్య అభిప్రాయబేధాలొచ్చాయి. 

కరుణాకర్ నియామకం పట్ల ఒక సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కరుణాకర్ మినహా ఎవరినైనా వేసుకోండని వారు తెగేసి చెప్పారు. దీంతో పార్టీలో రచ్చరచ్చ జరుగుతోంది. కరుణాకర్ నే సీఐగా ఉంచితే తాము సహించేది లేదని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. 

అదే తరుణంలో జిల్లాలలో పోలీసు అధికారుల బదిలీల వ్యవహరంలో అవినీతి జరిగిందంటూ వార్తలు వచ్చాయి. దీంతో విషయం కాస్త సీఎంఓ వరకు వెళ్లింది. దీంతో సీఎంవో ప్రత్యేక సమాచారాన్ని తెప్పించుకున్నారు. 

మరోవైపు సీఐల బదిలీ వ్యవహారంపై మాజీఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది. దర్శి, ఒంగోలు రూరల్ సీఐల బదిలీల విషయంలో స్థానిక నేతలు తనపై ఒత్తిడి తెస్తున్నారని వారిని మార్చాలంటూ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. 

ఒంగోలు రూరల్‌ సీఐగా తాను ఒకరిని సూచించగా వారికి అవకాశం ఇవ్వలేదని వాపోయారట. పైగా దర్శి సీఐ విషయంలో అయితే తొమ్మిదేళ్ల నుంచి పార్టీకి పనిచేస్తున్న వారంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలిపారట. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుని న్యాయం చేయాలంటూ జగన్ వద్ద మెరపెట్టుకున్నారట.

ఈ వ్యహారంపై సీఎం జగన్ సీఎంఓ అధికారులతో సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది. సీఎంవో దగ్గర ఉన్న సమాచారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో వైయస్ జగన్ దర్శి, ఒంగోలు రూరల్ ప్రస్తుత సీఐలను బదిలీ చేసి అందరికీ ఆమోదయోగ్యమైన సీఐలను నియమించుకోవాలని ఆదేశించారట.  

స్థానిక ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్, సుధాకర్ బాబులు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. మెుత్తానికి సీఐల బదిలీ వ్యవహారం జిల్లా రాజకీయాలను ఓ కుదుపు కుదుపేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios