13 జిల్లాల్లో యువతకు ఉపాధి: ఆహారశుద్ది, ఇథనాల పరిశ్రమలు ప్రారంభించిన జగన్
ఏపీ రాష్ట్రంలో ఆహారశుద్ది, ఇథనాలు పరిశ్రమలను సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు.
అమరావతి:తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.ఆహారశుద్ది, ఇథనాలు పరిశ్రమలను ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు వర్చువల్ గా ప్రారంభించారు.
మొత్తం 13 ప్రాజెక్టుల ద్వారా రూ. 2,851 కోట్ల పెట్టుబడులు రానున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దక్కుతుందన్నారు.ఈ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కుతాయని సీఎం జగన్ చెప్పారు.13 జిల్లాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలతో యువతకు ఉపాధి దక్కుతుందన్నారు. ఆహారశుద్ది పరిశ్రమల ద్వారా 90,700 మంది రైతులకు లబ్ది పొందే అవకాశం ఉందని సీఎం జగన్ వివరించారు.ప్రభుత్వం తరపున ఏమైనా సౌకర్యాలు అవసరమైతే ఒక్క ఫోన్ చేయాలని పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ సూచించారు.
ఈ ఏడాది జూలై మాసంలో కూడ ఆహారశుద్ది పరిశ్రమలను ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. రూ.1719 కోట్లతో ఆరు ఆహారశుద్ది పరిశ్రమలను సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో ఆర్ బీ కేలను ఏర్పాటు చేసి రైతులకు తమ ప్రభుత్వం ఇతోధికంగా సహాయపడుతున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడ ఆర్‌బీకేల పనితీరును పరిశీలించారు.
ఈ ఏడాది ఆరంభంలో విశాఖపట్టణంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పలు సంస్థలతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.ఈ ఒప్పందంలో భాగంగా పలు సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి.