గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా వాలంటీర్లుగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

తాడేపల్లిలోని తన నివాసంలో ఆయన శుక్రవారం రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

గత ఏడాది అక్టోబర్‌ 2న సచివాలయ వ్యవస్థకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. కార్యదర్శుల నియామకం చేపట్టి ఈ వ్యవస్థను జనవరి 26న పూర్తి స్థాయిలో ప్రారంభించారు.

సమస్త సేవలనూ ప్రజలకు చేరువ చేశారు. సచివాలయ వ్యవస్థతో సరికొత్త విప్లవం తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారు సామాన్యుడు సైతం సమస్యలను వేగంగా, సులభంగా పరిష్కరించుకునేందుకు గ్రామ సచివాలయలు ఉపయోగపడుతున్నాయి.

ప్రభుత్వ సేవలన్నీ గ్రామాలు, వార్డుల్లోనే పొందేలా వెసులుబాటు వచ్చింది. ప్రభుత్వ పథకాలు సైతం వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే దరిచేరుతున్నాయి.