వైఎస్ జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌ను నిషేధించింది. వైద్యరంగంలో సంస్కరణలకు నియమించిన సుజాతరావు కమిటీ 100కు పైగా సిఫార్సులతో బుధవారం ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది.

కమిటీ సిఫారసులపై నిపుణులతో విస్తృతంగా చర్చించిన సీఎం జగన్మోహన్ రెడ్డి వీటిని యథాతధంగా ఆమోదించింది. ప్రభుత్వ వైద్యుల వేతనాలను పెంచాలని కమిటీ సిఫారసు చేసింది.

జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ అమల్లోకి రానుంది. రెండు వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తెస్తూ, పశ్చిమగోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు. అలాగే మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ప్రభుత్వం కొత్తగా చేర్చింది.

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునేవారికి ఇకపై ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. నవంబర్ 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమవుతాయని.. డిసెంబర్ 21 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ కానున్నాయి.

సిఫారసులలోని లోటుపాట్లను గుర్తించి పూర్తిస్ధాయి అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఆపరేషన్ చేయించుకున్న వారు కోలుకునేంత వరకు, విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేల చొప్పున, ధీర్ఘకాలిక వ్యాధుల వారికి నెలకు రూ.5 వేలు ఇవ్వాలని సీఎం సూచించారు. అలాగే రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని జగన్ కోరారు.