దేశ రాజధాని న్యూడిల్లీలో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సమావేశానికి హాజరైన సీఎం వైఎస్ జగన్ కేంద్ర వైద్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయతో సమావేశమయ్యారు. 

న్యూఢిల్లీ: శనివారం జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (ys jagan) దేశ రాజధాని న్యూడిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే పనిలో పనిగా ఇటీవల ప్రకటించిన వైద్య కళాశాలలకు అనుమతులు, నూతన జిల్లాల్లో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు సంబంధించిన ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఈ మేరకు ముఖ్యమంత్రులు, న్యాయమూర్తుల సమావేశం అనంతరం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ (mansukh mandaviya)తో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. 

కేంద్ర మంత్రితో వైద్య కళాశాలలకు అనుమతులపై సీఎం జగన్ చర్చించారు. అలాగే కొత్తగా జిల్లాల ఏర్పాటుగురించి కూడా కేంద్రమంత్రికి వివరించిన సీఎం రాష్ట్రానికి మరిన్ని మెడికల్ కాలేజీలను కోరారు. ఈ మేరకు మన్‌సుఖ్‌ మాండవీయకు సీఎం జగన్ వినతిపత్రం సమర్పించారు. 

''విభజన తర్వాత రాష్ట్రంలో అత్యాధునిక వైద్యసదుపాయాల కొరత ఏర్పడింది. దీంతో రాష్ట్ర ప్రజలు మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి పక్కరాష్ట్రాల్లోని నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏపీలోనే అత్యాధునికి వైద్యసేవలు అందేలా... తద్వారా ఇక్కడే ప్రజలు వైద్యసేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. అందుకు కేంద్ర సహకారం అవసరం'' అని సీఎంను కేంద్ర మంత్రిని కోరారు.

''కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజారోగ్య వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ మరింత మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ దిశగా ఏపీ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది. ప్రాథమిక, ద్వితీయ స్థాయిల్లో ఆస్పత్రులను మెరుగుపరుస్తోంది. పీహెచ్‌సీలు, యుపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏహెచ్‌లు, డీహెచ్‌లు, అంతేకాక ప్రస్తుతం ఉన్న బోధనాసుపత్రులను, నర్సింగ్‌ కాలేజీలను అభివృద్ధి చేస్తోంది. గణనీయ రీతిలో ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీలను భర్తీచేస్తోంది'' అని సీఎం జగన్ వివరించారు. 

''దేశంలోని ప్రతి జిల్లాకు ఒక వైద్యకళాశాల ఏర్పాటు చేస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం కారణంగా అత్యాధునిక వైద్యంకోసం అవసరమైన నిపుణులు, ఆరోగ్య సేవలు అందించే మానవవనరులు తయారవుతాయి'' అన్నారు. 

'' ఏపీలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశాం. మొత్తంగా ఇప్పుడు రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇదివరకే 11 మెడికల్‌ కాలేజీలు ఉండగా, కేంద్రం పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో కొత్తగా మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. జిల్లాల విభజన తర్వాత ప్రజారోగ్య వ్యవస్థ పరంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, బాపట్ల, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు లేవు. కాబట్టి కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకుని మిగిలిన 12 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను'' అని కేంద్ర మంత్రితో సీఎం అన్నారు. 

''కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని యుద్దప్రాతిపదికన రెండేళ్లలోపై పూర్తిచేస్తాం. 2023 డిసెంబర్‌ నాటికి ఈ కాలేజీల నిర్మాణాలను పూర్తిచేసి 2024 అడ్మిషన్లకు వాటిని సిద్ధంచేస్తాం. కాబట్టి వీలైనంత త్వరగా అనుమతులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోగలరు'' అని కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయను సీఎం జగన్ కోరారు.