కోటంరెడ్డి, ఆనం అసంతృప్తి: ఉమ్మడి నెల్లూరు నేతలతో సీఎం జగన్ భేటీ
ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు తన క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.
అమరావతి:ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు తన క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాల నేతలతో పాటు రాష్ట్రంలోని 11 మంది రీజినల్ కో ఆర్డినేటర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నెల్లూరు సహ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతల మధ్య సమన్వయం పార్టీ బలోపేతం , ఇతర అంశాలపై చర్చించనున్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపంచారు. టీడీపీలో చేరేందుకే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. మరో వైపు ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా కొంతకాలంగా అసంతృప్తి గళం విన్పిస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆనం రామనారాయణరెడ్డిని ఇంచార్జీ బాధ్యతల నుండి తప్పించారు. ఆయన స్థానంలో నేదరురమల్లి రాంకుమార్ రెడ్డికి ఇంచార్జీ బాధ్యతలు అప్పగించారు. పార్టీ పరిశీలకుడిపై ఇదే జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ పరిశీలకుడు ధనుంజయ రెడ్డి కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు అసంతృప్తి గళం విన్పించిన నేపథ్యంలో జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. మరో వైపు రాష్ట్రంలోని 11 రీజినల్ కో ఆర్డినేటర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా తరహ ఘటనలు రాస్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయమై సీఎం జగన్ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లతో చర్చించనున్నారు.
త్వరలోనే ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు ముందే ఆయా జిల్లాలో పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీయనున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో వైసీపీ నాయకత్వం ముందుకు వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలపై ప్రజల్లో స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వచ్చింది వైసీపీ నాయకత్వం.
also read:రెండు నెలల్లో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం: అనుచరులతో ఆనం రామనారాయణ రెడ్డి
ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు ఎా పాల్గొంటున్నారనే విషయమై కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు సీఎం జగన్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే.