గుంటూరు: రెండేళ్లలో ప్రభుత్వ స్కూల్స్ రూపు రేఖలను మారుస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ను మారుస్తామని సీఎం స్పష్టం చేశారు.

గుంటూరు జిల్లా పెనుమాక ప్రభుత్వ పాఠశాలలో రాజన్న బడి బాట కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు ప్రారంభించారు.విద్యార్థులతో పలకలపై అక్షరాలను దిద్దించి వైఎస్ జగన్ రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఇవాళ తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు నచ్చిన కార్యక్రమాన్ని ప్రారంభిచింనందుకు తనకు సంతోషంగా ఉందని  సీఎం చెప్పారు.తాను సుదీర్ఘంగా నిర్వహించిన పాదయాత్రలో  పిల్లల చదువును తాను తీసుకొంటానని మాట ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఈ మాటను ఇవాళ నిలబెట్టుకొంటున్నట్టుగా  ఆయన చెప్పారు.

పిల్లలు చక్కగా చదువుకోవాలన్నదే తన ఆకాంక్షగా సీఎం జగన్ చెప్పారు.  పిల్లలను బడులకు పంపిస్తే వచ్చే ఏడాది జనవరి 26 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పండుగను నిర్వహించనున్నట్టు జగన్ స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే నాడు బడికి పంపే ప్రతి విద్యార్ధి తల్లికి రూ. 15వేలు చెల్లించనున్నట్టుగా జగన్  ప్రకటించారు.

అన్ని ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం బోధన జరగాల్సిందేనని సీఎం ఆదేశించారు.అదే సమయంలో తెలుగు బోధన తప్పనిసరి చేయనున్నట్టుగా సీఎం ప్రకటించారు.  

ఏపీలో చదువుకోని వారు 33 శాతం ఉన్నారని జగన్ చెప్పారు. పాఠశాలలు ప్రారంభమై ఆరు మాసాలు దాటినా కూడ ప్రభుత్వ పాఠశాలలకు  పుస్తకాలు అందని విషయాన్ని తాను గమనించినట్టుగా ఆయన గుర్తు చేశారు. స్కూల్స్ తెరిచిన వెంటనే మూడు జతల యూనిఫారాలు విద్యార్ధులకు అందించనున్నట్టు సీఎం చెప్పారు. 

ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు షాక్ కొడుతున్నాయని జగన్ అభిప్రాయపడ్డారు.  ఇప్పటికే రాష్ట్రంలోని  స్కూల్స్ పరిస్థితులపై  సమీక్ష నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.