గడప గడపకూ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకోవాల్సిందేనని హెచ్చరించారు సీఎం వైఎస్ జగన్. పనితీరు బాగోని ఎమ్మెల్యేలను కొనసాగించడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. సర్వేల్లో మీ పేరు పైన వుండేలా చూసుకోవాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఎమ్మెల్యేలు , పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్. నాలుగున్నరేళ్లలో దేశానికి ఆదర్శంగా నిలబడేలా ఏం చేశామనే దానిపై ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నామని.. ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి , ప్రజలకు చేస్తున్న మంచిని వివరించాలని జగన్ సూచించారు. ఈ సారి ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవాలని.. అదేం పెద్ద కష్టమైన విషయం కాదని సీఎం పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 87 శాతం ప్రజలకు మంచి జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామాల్లో 92 శాతం, పట్టణ ప్రాతాల్లో 84 శాతం మంచి జరిగిందని సీఎం వివరించారు. ప్రతి ఇంటికి మంచి జరుగుతున్నప్పుడు దానిని చెప్పుకోవాల్సిన బాధ్యత వుందని ముఖ్యమంత్రి తెలిపారు. గృహ సారథులు, వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లను ఏకం చేయాలని జగన్ తెలిపారు. ఇప్పటి వరకు జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం చేశామని.. దీనికి కొనసాగింపుగా జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జూలై 1 నుంచి నాలుగు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి నుంచి సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతామని సీఎం వివరించారు.
ALso Read: తిరగలేదు, ఆ 18 మంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతా.. గడప గడపకు సమీక్షలో సీఎం జగన్..!!
జగనన్న సురక్ష కార్యక్రమంలో వాలంటీర్లు, సచివాలయం, గృహ సారథుల వ్యవస్థలు ప్రతి ఇంటికి వెళ్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. మండల స్థాయికి చెందిన అధికారులను ఒక రోజంతా సచివాలయంలో వుంచుతామని జగన్ వెల్లడించారు. ఇంత పెద్ద స్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయడం దేశంలో ఇదే తొలిసారని సీఎం అన్నారు. గృహ సారథులు అనే వారు ఎమ్మెల్యేల గెలుపు, ఓటమికి మధ్య కీలకపాత్ర పోషిస్తారని జగన్ స్పష్టం చేశారు. గడప గడపకు కార్యక్రమం అత్యంత కీలకమైనదన్న జగన్.. దీనిని ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. సర్వేల్లో మీ పేరు పైన వుండేలా చూసుకోవాలని.. పనితీరు బాగుంటేనే కొనసాగిస్తామని జగన్ తేల్చిచెప్పారు.
ఎమ్మెల్యేల పనితీరు బాగోకపోతే.. అలాంటి వారిని కొనసాగించడం వల్ల పార్టీకి, వారికి నష్టమేనని సీఎం పేర్కొన్నారు. మీ గ్రాఫ్ బలంగా వుండటానికి, ప్రజలకు చేరువ కావడానికి గడప గడపకు కార్యక్రమం ఉపయోగపడుతుందని జగన్ వెల్లడించారు. పనితీరు బాగోక టికెట్లు రాకుంటే తనను బాధ్యుడిని చేయొద్దని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలన, మన ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలను నాడు-నేడు ద్వారా ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని జగన్ సూచించారు.
