మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ గత కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరేలాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ నుంచి తొలగించిన వారికి పార్టీ బాధ్యతలు ఇస్తామని స్పష్టం చేశారు.
మారకపోతే మార్చేస్తానంటూ వైసీపీ (ysrcp) ఎమ్మెల్యేలను హెచ్చరించారు సీఎం జగన్ (ys jagan mohan reddy) . వైఎస్ఆర్‌ఎల్పీ (ysrcp legislative meeting) సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ నుంచి గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఇక మంత్రి వర్గంలో మార్పులపై (ap cabinet reshuffle) మరోసారి స్పష్టత ఇచ్చారు జగన్. కేబినెట్‌లో నుంచి తొలగించిన వారికి పార్టీ బాధ్యతలు, జిల్లా అధ్యక్ష పదవులు, అలాగే రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగిస్తామని జగన్ చెప్పారు. మీరు గెలిచి, పార్టీని గెలిపించుకుని రావాలని.. అప్పుడు మళ్లీ అవకాశాలు వస్తాయని అన్నారు. రెండు సంవత్సరాల్లో ఈ పరీక్షా సమయం రాబోతోందని చెప్పారు. ఎవరు పనితీరు చూపించకపోయినా సరే.. ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు జగన్. ఇంటింటికి వెళ్లకపోతే సర్వేల్లో పేర్లు రావని హెచ్చరించారు. సర్వేల్లో రాకపోతే.. మొహమాటం లేకుండా టికెట్లు ఇవ్వబోనని తేల్చిచెప్పారు.
ఇప్పుడు మంత్రులుగా వచ్చే వారు మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు జగన్. తలా ఒక చేయి వేస్తేనే మనం గెలుస్తామని, అధికారంలోకి వస్తామని చెప్పారు. తప్పదు అనుకున్న చోట.. కొన్ని సామాజిక సమీకరణాల వల్ల కొన్ని కొన్ని మినహాయింపులు మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలు వుంటాయని చెప్పారు. చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే అది తప్పే అవుతుందని.. గోబెల్స్ ప్రచారంపై అలర్ట్‌గా వుండాలన్నారు. 26 కొత్త జిల్లాలకు అధ్యక్షులను తీసుకుంటామని.. ఇప్పటివరకూ ఎలా ఉన్నా, ఇకపై ముందుకు కదలాలని జగన్ సూచించారు. తప్పుడు ప్రచారాలను కౌంటర్ చేసే ఆయుధాలను కార్యకర్తల చేతిలో పెట్టాలని.. ఏమీ లేకపోయినా ఏదో జరుగుతుందనే భ్రమ కల్పిస్తారని సీఎం స్పష్టం చేశారు.
మరోవైపు.... 2024 అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) చేతికి ఎమ్మెల్యేల పనితీరు, గెలుపు అవకాశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదినట్లు సమాచారం. ఇదే ఇప్పుడు వైసిపి (ysrcp) ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతోంది. ఈ రిపోర్ట్ ఆధారంగా దాదాపు 50మంది వైసిపి ఎమ్మెల్యేలపై పార్టీ అధినేత గుర్రుగా వున్నట్లు సమాచారం. వివిధ కారణాలతో ప్రజలు తిరస్కరించే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తేలడంతో దాదాపు 50మంది ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు వైసిపి అధినేత సిద్దమయినట్లు సమాచారం.
వివిధ అవినీతి ఆరోపణలు, పనితీరు సరిగ్గా లేకపోవడం, నియోజవర్గ ప్రజలకు అందుబాటులో వుండకపోవడం వంటి కారణాలతో కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయటపెట్టింది. దీంతో ఇలాంటివారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వకూడదని సీఎం నిర్ణయించుకున్నారట. ఇక మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీ బలోపేతానికి పాటుపడుతూ నిబద్దతగా వుండకపోవడం, ఏ క్షణానయినా పార్టీ మారే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయటపెట్టింది. దీంతో ఇలాంటివారిపై కూడా వేటుకు సీఎం జగన్ సిద్దపడినట్లు తెలుస్తోంది.
ఇలా తొలిసారి ఎన్నికైన దాదాపు 30మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని జగన్ కు రిపోర్ట్ అందిందట. వివిధ కారణాలతో వీరి గెలుపు అవకాశాలు కూడా సన్నగిల్లడంతో మరోసారి అవకాశం ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారట. అలాగే మరో 12 మంది సీనియర్ ఎమ్మెల్యే, ఎనిమిది మంది మహిళా ఎమ్మెల్యేల తీరుపై ప్రజలు అసంతృప్తితో వున్నారట. ఇలా 150మంది వైసిపి ఎమ్మెల్యేల్లో 50మంది తిరిగి గెలిచే అవకాశాలు లేకపోవడంతో వారిపై వేటుకు పార్టీ అధినేత జగన్ సిద్దమయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
