త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శుక్రవారం ఆయన వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీటర్ల బిగింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వ్యవసాయ రంగానికి ఇస్తున్న విద్యుత్‌పై వైసీపీ అధినేత (ysrcp) , ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) కీలక ప్రకటన చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో త్వరలోనే వ్యవసాయ మోటార్లకు మీటర్లు (agricultural motors) ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు. ఈ దిశగా శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయ్యిందని తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు వల్ల నాణ్యమైన విద్యుత్ అందుతుందన్న జగన్... రైతులకు మెరుగైన విద్యుత్ ఇవ్వగలమని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే సాగు మోటార్లకు మీటర్లపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు.
సమీక్షలో భాగంగా రైతు భరోసా, రైతులకు పంట నష్టపరిహారం చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ, ఖరీఫ్ సన్నద్ధత, కిసాన్ డ్రోన్లు, మిల్లెట్ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై జగన్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 16న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన జగన్... జూన్ మొదటి వారంలో రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేస్తామని చెప్పారు. అదే నెలలో 3 వేల ట్రాక్టర్లు సహా, 4014 వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేస్తామని, 402 హార్వెస్టర్లను కూడా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు.
ఇకపోతే.. బుధవారం విద్యుత్ శాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ డిమాండ్, సప్లై, పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలపై సీఎం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనూహ్య డిమాండ్ వున్నా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసి మిగులు విద్యుత్ ను కలిగివుండే స్థాయికి ఆంధ్రప్రదేశ్ మరికొద్ది నెలల్లో చేరుకుంటుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. సెకీతో ఒప్పందం కారణంగా సుమారు 45 మిలియన్ యూనిట్లు రాష్ట్రానికి దశలవారీగా అందుబాటులో రానుందన్నారు. మొత్తం మూడు దశల్లో సెకీ విద్యుత్తు అందుబాటులోకి వస్తోందని... 2023 చివరి నాటికి మొదటి దశలో సుమారు 18 మిలియన్ యూనిట్లు, రెండో దశలో సుమారు 18 మిలియన్ యూనిట్లు, మూడో దశలో సుమారు 9 మిలియన్ యూనిట్లు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని సీఎం వెల్లడించారు
