అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ కేబినెట్ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ నేతృత్వంలో తొలిసారిగా జరిగిన సమావేశంలో మంత్రులంతా కాస్త గందరగోళానికి గురయ్యారు. 

ఇప్పటికే అధికారులతో వరుస రివ్యూలు నిర్వహిస్తూ వణుకుపుట్టిస్తున్న జగన్ తమ శాఖలపై, తమ పనితీరుపై ఎలాంటి కామెంట్లు చేస్తారా అని కొత్తమంత్రులు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన జగన్ కాస్త నవ్వండన్నా, నవ్వండమ్మా అంటూ చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

అనంతరం అధికారులకు, మంత్రులకు పలు సూచనలు చేశారు. మంత్రులకు తెలియకుండా అధికారులు ఎలాంటి నిర్ణయాలుు తీసుకోవదన్నారు. తన కేబినెట్ లో ఉన్న మంత్రులు డమ్మీ కాదని హీరోలని చెప్పుకొచ్చారు. మంత్రులు, అధికారులు కలిసి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని జగన్ సూచించారు. 

అలాగే అధికారులతో సమన్వయం చేసుకుని రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించడంలో సహకరించాలని మంత్రులను కోరారు. గతంలో ఆయా మంత్రిత్వశాఖల్లో జరిగిన అవినీతిని ప్రజలకు తెలిసేలా వెబ్‌సైట్‌లో పొందుపరచాలని జగన్ సూచించారు. 

ఈ సందర్భంగా మంత్రులకు వార్నింగ్ లు సైతం ఇచ్చారు జగన్. మంత్రులు అవినీతి జోలికి వెళ్లొద్దని హితవు పలికారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే బర్తరఫ్ చేస్తానని తేల్చి చెప్పేశారు. 

డబ్బులు ఎలాగైనా వస్తాయి, కానీ మంత్రి పదవులు రావు కదా అని అన్నారు. రెండున్నరేళ్లు మంత్రి పదవులు గ్యారంటీ అనుకోవద్దని మీ పనితీరు, నిబద్ధతపై ఆధారపడి ఉంటుందని మంత్రులకు క్లాస్ పీకారు వైయస్ జగన్.