అమరావతి: ఇవాళ(గురువారం) డిజాస్టర్‌ రెస్సాన్స్, ఎమర్జెన్సీ రెస్సాన్స్‌ వాహనాలను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్‌.  సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు సీఎం. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని మరింతగా బలపరిచే ఉద్దేశంతో ఈ వాహనాలను ప్రారంభించామన్నారు. ఈ చర్యలు పోలీసుల సమర్థతను మరింతంగా పెంచడమే కాకుండా క్షేత్రస్ధాయిలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు తోడ్పడుతుందన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతాయన్నారు.

''ఇవాళ ఇస్తున్న వాహనాల్లో రెండు రకాలు వాహనాలు ఉన్నాయి. 14 డిజాస్టర్‌ రెస్పాన్స్‌ మరియు రెస్క్యూ వాహనాలు ఇస్తున్నాం. ఇంతకుముందు విపత్తు లేదా ఏదైనా తీవ్ర ఘటన జరిగితే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఫోర్స్‌ పోగలుగుతారు. కానీ మనుషులను కాపాడేందుకు అవసరమైన అత్యాధునిక పరికరాలు కూడా అవసరం. అందుకు వీలుగా ఈ వాహనాల్లో సామగ్రి, ప్రత్యేక పరికరాలు ఉంటాయి. అగ్ని ప్రమాదాల్లాంటి ఘటనల్లోకూడా రక్షించడానికి వీలుగా వీటిని తీర్చిదిద్దారు.ప్రజలను ఆదుకునే కార్యక్రమాల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి'' అని వివరించారు.

''36 ఎమర్జెన్సీ రెస్సాన్స్‌ వెహికల్స్‌ను కూడా పోలీస్‌శాఖకు అప్పగిస్తున్నాం. ఒక్కో పోలీస్ జిల్లాకు 2 వాహనాలు చొప్పున 18 పోలీసు జిల్లాలకు36 వాహనాలు అప్పగిస్తున్నాం. ఈ వాహనంలో రేడియో పరికరాలు, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్స్, నెట్‌వర్క్‌ వీడియో రికార్డింగ్‌ సహా పలు సదుపాయాలు ఉన్నాయి'' అన్నారు.

''ఏదైనా ఘటన జరిగితే వెంటనే ఈ వాహనాలు కంట్రోల్‌రూం నుంచి డిప్లాయ్‌ చేయడం జరుగుతుంది. ఒక్కో వాహనంలో 10 మంది సిబ్బందిని కూడా ఘటనా స్థలానికి పంపే అవకాశం ఉంటుంది. దీనికోసం మొత్తం 92 మంది సిబ్బందికి  కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వీరు వెళ్లిన చోట ఘటనకు సంబంధించి లైవ్‌ రికార్డింగ్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది.  తద్వారా ఘటనా స్థలంలో ఏం జరుగుతుందో నేరుగా కంట్రోల్‌ రూంలో చూసే అవకాశం ఉంటుంది. మనుషుల ప్రాణాలు కాపాడేలా ఈ వాహనాల వ్యవస్థ ఉంటుంది.పోలీసు శాఖ సమర్థతను పెంచుతుంది'' అన్నారు.

''దిశ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి పెద్ద ఎత్తున వాహనాలను పోలీసు శాఖకు ఇవ్వబోతున్నాం. త్వరలోనే వాటిని కూడా అందిస్తాం. ఆల్‌ ద బెస్ట్‌ టు పోలీసు డిపార్ట్‌మెంట్‌'' అని సీఎం జగన్ వెల్లడించారు.