స్వర్ణిమ్ విజయ్ వర్ష్: రిటైర్డ్ మేజర్ వేణుగోపాల్‌ను సత్కరించిన జగన్
1971లో జరిగిన భారత్ - పాక్ యుద్ధంలో విశేష సేవలందించిన మహావీరచక్ర, పరమవిశిష్ట సేవా మెడల్ గ్రహీత రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్‌ను ఏపీ సీఎం జగన్ సత్కరించారు.
1971లో జరిగిన భారత్ - పాక్ యుద్ధంలో విశేష సేవలందించిన మహావీరచక్ర, పరమవిశిష్ట సేవా మెడల్ గ్రహీత రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్‌ను ఏపీ సీఎం జగన్ సత్కరించారు. ఆయన వయసు 95 ఏళ్లు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురవడంతో సీఎం జగన్ నేరుగా తిరుపతిలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్వర్ణిమ్ విజయ్ వర్ష్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి గతేడాది డిసెంబర్ 16వ తేదీన ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద వెలిగించిన విజయ జ్వాల (విక్టరీ ఫ్లేమ్) బుధవారం తిరుపతి చేరుకుంది. 20వ తేదీ వరకు ఇది తిరుపతిలోనే ఉంటుంది.
ఈ విజయ జ్వాలను బుధవారం తిరుపతిలో ఏవోసీ సెంటర్ కమాండెంట్ బ్రిగేడియర్ జేజేఎస్ బిందర్ సైనిక గౌరవాలతో అందుకున్నారు. నేడు సీఎం వైఎస్ జగన్ ఆ జ్వాలను స్వీకరించారు. ఇదే సమయంలో వేణుగోపాల్ ఇంటి వద్ద సీఎం ఓ మొక్కను నాటారు.