YSR 73rd Birth Anniversary : ‘కోట్లాదిమంది చిరునవ్వులో నువ్వే నాన్నా’.. సీఎం జగన్ భావోద్వేగ పోస్ట్..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా ఆయనను తలుచుకుని ఏపీ సీఎం వైఎస్ జగన్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ షేర్ చేశారు.
కడప : దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి 73 వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ ముఖ్య వైయస్ జగన్మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే… మహానేత వైయస్ఆర్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
నేడు వైసీపీ మూడో రాష్ట్రస్థాయి ప్లీనరీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి 73 వ జయంతి. దీన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కోట్లాదిమంది చిరునవ్వుల్లో మీ రూపం కనిపిస్తూనే ఉంటుందని తండ్రిని గుర్తు చేసుకున్నారు. ‘నాన్న.. మిమ్మల్ని ఆరాధించే కోట్ల మంది చిరునవ్వుల్లో నిత్యం మీ రూపం కనిపిస్తూనే ఉంటుంది. ఇచ్చిన మాట, నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి శ్వాస వరకు కట్టుబడి జీవించిన మీ జీవితమే నాకు స్ఫూర్తి. ప్రజాసంక్షేమం కోసం మీరు చేసిన ఆలోచనలు ఈ ప్రభుత్వానికి మార్గదర్శకం’ అని సీఎం జగన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
కాగా, వైఎస్ఆర్ జయంతి వేడుకలను వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల, విజయమ్మ మిగతా కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అలాగే గుంటూరులోని నాగార్జున వర్సిటీ ఎదురుగా జరిగే వైఎస్ఆర్సిపి ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. మరోవైపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా.. కాసేపట్లో మీడియా ముందుకు షర్మిల
ఇక వైసీపీ మూడో ప్లీనరీ మొదలయ్యింది. ఇందులో పార్టీ ఆడిట్ ఖర్చుల స్టేట్మెంట్ను బి కృష్ణమోహన్ రెడ్డి ప్లీనరీ ప్రతిపాదించి ఆమోదం కోరనున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా నియమావళిని సవరణలు ప్రతిపాదించి… ప్లీనరీ ఆమోదం కోరబోతున్నారు. ఆ తర్వాత మహిళా సాధికారత - దిశ చట్టం, విద్య, నవరత్నాలు-డీబీటీ, వైద్యం, పరిపాలన- పారదర్శకత అంశాలపై చర్చించి తీర్మానాలను ప్రవేశపెడతారు.
ఇక రెండో రోజైన శనివారం సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు- ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా- దుష్టచతుష్టయంపై చర్చించి.. తీర్మానాలను ప్రవేశ పెట్టి.. ఆమోదం కోరుతారు. అధ్యక్ష ఎన్నికలు ప్రకటించి అభినందనలు తెలుపుతారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ ముగింపు ఉపన్యాసం ఇస్తారు. ఆ తర్వాత వందన సమర్పణతో ప్లీనరీ ముగుస్తుంది.