Asianet News TeluguAsianet News Telugu

బంపర్ ఆఫర్: జగన్ తో బిజెపి సయోధ్య ప్రయత్నాలు

ఇటీవల సీఎం జగన్ తీసుకున్న పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్ విషయంలో గానీ, పీపీఏల విషయంలో గానీ కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. వైయస్ జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. దానికితోడు ఏపీ బీజేపీ నేతలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దాంతో ఏపీలో బీజేపీ-వైసీపీల మధ్య సఖ్యత చెడిందని వారిద్దరి మధ్య రాజకీయ పోరు నడుస్తోందనే ప్రచారం పొలిటికల్ సర్కిల్ లో జోరుగా సాగుతోంది.

ap cm ys jagan elected as Interstate Council Standing Committee member
Author
New Delhi, First Published Aug 20, 2019, 5:46 PM IST

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో స్నేహానికి రెడీ అంటుంది కేంద్రంలోని బీజేపీ. ఏపీలో జగన్ తో కలిసి వెళ్లేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.  ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇకపై కలిసి వెళ్లాలని నిర్ణయించుకుందో ఏమో ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి కీలక పదవి ఆఫర్ చేసింది కేంద్రంలోని బీజేపీ. 

అంతరాష్ట్రాల మండలి స్థాయి సంఘం సభ్యుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డిని నియమించింది. అంతరాష్ట్రాల మండలి స్థాయీ సంఘంలో చోటు దక్కించుకున్న బీజేపీయేతర ముఖ్యమంత్రుల్లో జగన్ ఒకరవ్వడం విశేషం. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ పదవి దక్కించుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్. 

ఇంకొక విశేషం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీలో సీఎం వైయస్ జగన్ తో కయ్యానికి కాళ్లు దువ్వేకన్నా చెలిమితో ముందుకు వెళ్లడమే భావ్యమని బీజేపీ భావిస్తోందని అందులో భాగంగానే కేసీఆర్ ను పక్కకు నెట్టి మరీ జగన్ కు పదవి ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. 

ఈ అంతరాష్ట్రాల మండలి స్థాయి సంఘానికి గతంలో ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉండేవారు. అయితే రెండోసారి నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత కీలక మార్పులు చేశారు. హోంశాఖ మంత్రి అమిత్ షాను అంతరాష్ట్రాల మండలి స్థాయీ సంఘానికి చైర్మన్ గా నియమించారు.   

ఇకపోతే అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఈ అంతరాష్ట్రాల మండలి స్థాయి సంఘంలో తటస్థంగా ఉన్న వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్‌కు మాత్రమే చోటు కల్పించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు చోటు కల్పించడం విశేషం. యూపీఏ భాగస్వామ్య పక్షమైన జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కూడా ఛాన్స్ ఇచ్చారు. 

వైయస్ జగన్మోహన్ రెడ్డి, నితీష్ కుమార్, అమరీందర్ సింగ్ తో పాటు అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్ , విజయ్ రూపాణీ (గుజరాత్), దేవేంద్ర ఫడణవీస్ (మహారాష్ట్ర), యోగి ఆదిత్యనాథ్ (ఉత్తర ప్రదేశ్), కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్ (ఆర్థిక), నరేంద్ర సింగ్ తోమర్ (వ్యవసాయం), తావర్ చంద్ గెహ్లాట్(సామజిక న్యాయం), గజేంద్రసింగ్ షెకావత్ (జలశక్తి) సభ్యులుగా అవకాశం కల్పించారు. 

రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాల గురించి దర్యాప్తు చేయడం, ఆ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన సూచనలు, సలహాలను కేంద్ర ప్రభుత్వానికి అందించడమే ఈ స్థాయీ సంఘం ప్రధాన విధి. 

ఇకపోతే మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇటు ఏపీలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయడం ఇట్టే జరిగిపోయాయి. ఇకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే సీఎఎం జగన్ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరారు కూడా.

అంతేకాదు కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా లోక్ సభలో ప్రవేశపెట్టిన బిల్లులకు సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆనాటి కేంద్రప్రభుత్వమైన బీజేపీకి మద్దతు తెలిపింది.  

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కీలకమైన ఆర్టికల్ 370తోపాటు ఇతర బిల్లులకు మద్దతు ప్రకటించింది. అయితే ట్రిపుల్ తలాఖ్ బిల్లు విషయంలో తటస్థంగా ఉండిపోయింది. ఇకపోతే గత కొద్దికాలంగా బీజేపీతో ఉన్న స్నేహానికి గుర్తుగా వైసీపీకి చెందిన ఎంపీలకు కీలక పదవులు ఇప్పటికే ఇచ్చింది కేంద్రం. 

లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ ఇచ్చినప్పటికీ జగన్ ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారు. అయినప్పటికీ ఊరుకోని కేంద్రం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని లోక్ సభ ప్యానల్ స్పీకర్ గా నియమించింది. 

ఆ తరువాత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎస్టిమేట్ కమిటీ సభ్యునిగా నియమించింది. ఇకపోతే రాజ్యసభ సభ్యుడు, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిని మంగళగిరి ఎయిమ్స్ సభ్యునిగా నియమించింది. 

ఇటీవలే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అమలాపురం ఎంపీ చింతా అనురాధను కోకోనట్‌ బోర్డు సభ్యురాలిగా నియమించింది. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కోకోనట్‌ బోర్డు దేశంలో కొబ్బరి ఉత్పత్తుల అభివృద్దికి, కొబ్బరి సాగు విస్తర్ణం పెంచడానికి కృషి చేస్తుంది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు....ఎన్నికల అనంతరం వైసీపీ-బీజేపీల మధ్య చాలా సఖ్యత ఉండేది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ తీసుకునే కీలక నిర్ణయాలకు సంఘీభావం ప్రకటిస్తూనే ఉంది. 

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పంథాను కొనసాగిస్తోంది. అయితే గత కొద్దిరోజులుగా ఏపీలో బీజేపీ నేతల వైఖరిని చూసి వైసీపీ- బీజేపీ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.  

ఏపీలో బలపడాలన్న బలమైన నిర్ణయంతో ఉంది బీజేపీ. అంతేకాదు ఏపీలో ప్రధాన ప్రతిక్షంగా ఉన్న టీడీపీ స్థానాన్ని భర్తీ చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీపై బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఇతర నేతలు ఒంటికాలిపై లేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

అంతేకాదు ఇటీవల సీఎం జగన్ తీసుకున్న పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్ విషయంలో గానీ, పీపీఏల విషయంలో గానీ కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. వైయస్ జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. 

దానికితోడు ఏపీ బీజేపీ నేతలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దాంతో ఏపీలో బీజేపీ-వైసీపీల మధ్య సఖ్యత చెడిందని వారిద్దరి మధ్య రాజకీయ పోరు నడుస్తోందనే ప్రచారం పొలిటికల్ సర్కిల్ లో జోరుగా సాగుతోంది. అయితే తాజాగా సీఎం జగన్ కు కీలక పదవి ఇవ్వడంతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios